Team India Test Captain: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు..!

Who Doesnt Want To Captain Team India Says Mohammed Shami - Sakshi

Mohammed Shami Comments On Team India Test Captaincy: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. స్టార్లతో నిండిన భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎవరు కాదనుకుంటారని స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  కెప్టెన్సీ ప్రతిపాదన తన వరకు వస్తే తప్పక స్వీకరిస్తానని.. భారత సారధ్య బాధ్యతలపై మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే ప్రస్తుతానికి తన దృష్టంతా మరింత మెరుగ్గా రాణించడంపైనే ఉందంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. జట్టుకు ఉపయోగపడే ఏ పనికైనా తాను సిద్ధమేనంటూ.. కెప్టెన్సీపై బీసీసీఐ పెద్దలకు పరోక్ష సంకేతాలు పంపాడు. టీమిండియాకు ప్రాతనిధ్యం వహించే అవకాశం రావడమే గొప్ప వరమని, దాన్ని కాపాడుకునేందుకు వంద శాతం కృషి చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ  షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓట‌మి అనంత‌రం విరాట్ కోహ్లి టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌-2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటను బయల్దేరేముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు అవసరం​ లేదంటూ కోహ్లి వన్డే కెప్టెన్సీని లాక్కుంది. ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. తదనంతర పరిణామాల్లో కోహ్లి.. టెస్ట్‌ కెప్టెన్సీకి సైతం గుడ్‌బై చెప్పడంతో ప్రస్తుతానికి ఆ పోస్ట్‌ ఖాళీగా ఉంది. 

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీ రేసులో ఇప్ప‌టికే ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌ ముందుండగా.. వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్, పేసు గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా, వికెట్‌కీపర్‌ రిష‌బ్ పంత్ వంటి ఆట‌గాళ్ల తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తాజాగా షమీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు అతను కూడా రెడీగానే ఉన్న విషయం స్పష్టమవుతుంది. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న షమీ.. ఆటగాడిగా ఇదివరకే తనను తాను ప్రూవ్‌ చేసున్నాడు. టెస్ట్‌ల్లో 209 వికెట్లు, వ‌న్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టి భారత దేశపు విజయవంతమైన పేస్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ అనంతరం సెలెక్టర్లు షమీకి విశ్రాంతినిచ్చారు. అందుకు కొనసాగింపుగా విండీస్‌తో సిరీస్‌ కోసం కూడా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.
చదవండి: IND Vs WI: 6వ స్థానానికి అతనిని మించిన మొనగాడు లేడు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top