
Jadeja Is No More Reckless Kid Says Dinesh Karthik: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ వికెట్‌కీపర్, ప్రముఖ వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలి కాలంలో జడేజా నమ్మకమైన ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడంటూ కితాబునిచ్చాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా, పర్ఫెక్ట్ ఫినిషర్‌గా, నాణ్యమైన బౌలర్‌గా, అంతకుమించి అద్భుతమైన ఫీల్డర్‌గా జట్టుకు సేవలందించడం ఇటీవలి కాలంలో మనందరం గమనించామంటూ కొనియాడాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో జడేజా లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లో సైతం అతను అద్భుతాలు చేయడం చూశామన్నాడు. అతని సామర్థ్యం తెలిసి ధోని(ఐపీఎల్) అతనికి బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పిస్తే, ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడని గుర్తు చేశాడు. నంబర్ 6 స్థానం కోసం అతనికంటే పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్రికెటర్ ప్రస్తుత తరంలో లేడని ఆకాశానికెత్తాడు. గత ఐపీఎల్ సందర్భంగా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 37 పరుగులు పిండుకున్న విషయాన్ని ప్రస్తావించాడు.
గత కొద్ది సంవత్సరాలుగా బ్యాటర్‌గానే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణిస్తున్న జడేజా.. ఆల్‌టైమ్ బెస్ట్ ఆల్‌రౌండర్‌గా రాటుదేలుతున్నాడని, ఇకపై అతనింకెంత మాత్రం నిర్లక్ష్యపు ఆటగాడు కాదని, అన్ని విభాగాల్లో కావాల్సిన పరిణితి సాధించాడని కొనియాడాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్‌తో అద్భుతాలు చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, జడేజా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో విండీస్‌తో సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హూడా, తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికై దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు.
చదవండి: IND Squad For WI Series: యార్కర్ల 'నట్టూ' ఏమైనట్టు..?