చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్ | Historic Series Win, West Indies Beat Sri Lanka In Test Series For The First Time Since 2003, Read Story Inside | Sakshi
Sakshi News home page

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

Jul 8 2026 8:47 AM | Updated on Jul 8 2026 11:21 AM

West Indies seal series win after high scoring draw in Antigua

రెండో టెస్టు డ్రాగా ముగింపు

తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన వెస్టిండీస్‌

1-0తో విండీస్‌ సిరీస్ విజయం

2023 ఫిబ్రవరి తర్వాత విండీస్‌కు తొలి టెస్టు సిరీస్ విజయం

2003 తర్వాత శ్రీలంకపై తొలి టెస్టు సిరీస్ గెలుపు

ఆంటిగ్వాలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు హైస్కోరింగ్ డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విండీస్, రెండో టెస్టును డ్రాగా ముగించడంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 

2023 ఫిబ్రవరి తర్వాత వెస్టిండీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. అలాగే శ్రీలంకపై 2003 తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం.

రెండో టెస్ట్‌ చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 92/2తో ఆట ప్రారంభించిన శ్రీలంక వేగంగా పరుగులు సాధించింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, మిలన్ రత్నాయకే వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడడంతో లంచ్ సమయానికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

అనంతరం ఆధిక్యాన్ని 300 దాటించిన శ్రీలంక 251/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దినేశ్ చండిమల్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్ 44 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.

306 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, బ్రాండన్ కింగ్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో రెండు సార్లు చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించినా ఫలితంపై ప్రభావం చూపలేదు. 

ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ ఎల్బీగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా, డీఆర్‌ఎస్‌లో నిర్ణయం మారడంతో శ్రీలంకకు నిరాశ ఎదురైంది.

చివరికి క్యాంప్‌బెల్ (51 నాటౌట్), బ్రాండన్ కింగ్ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును నిలబెట్టగా, ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 549/9 డిక్లేర్ చేయగా, లహిరు ఉదార 188, సోనాల్ దినూష 92, కమిందు మెండిస్ 84 పరుగులతో రాణించారు. ప్రత్యుత్తరంగా వెస్టిండీస్ 499 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్‌ హోప్ 112 పరుగులతో ఆకట్టుకోగా, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. 

కాగా, తొలి టెస్టులో సాధించిన ఘన విజయమే సిరీస్ ఫలితాన్ని వెస్టిండీస్‌కు అనుకూలంగా మలిచింది.
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement