డివిలియర్స్‌, డుమిని మెరుపులు.. ఉత్కంఠ పోరులో చివరికి.. | WCL 2026 De Villiers JP Duminy Powers South Africa Beat England | Sakshi
Sakshi News home page

డివిలియర్స్‌, డుమిని మెరుపులు.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం

Oct 13 2026 8:48 PM | Updated on Oct 13 2026 9:00 PM

WCL 2026 De Villiers JP Duminy Powers South Africa Beat England

(PC: WCL X)

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2026 టీ20 టోర్నీలో సౌతాఫ్రికా చాంపియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు అందుకున్న డివిలియర్స్‌ బృందం.. తాజాగా మరో గెలుపు నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను తొమ్మిది పరుగుల తేడాతో ఓడించింది.

డివిలియర్స్‌ మెరుపు అర్ధ శతకం
తద్వారా వరుసగా నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో సరేల్‌ ఎర్వీ (7) విఫలం కాగా.. కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ మెరుపు అర్ధ శతకం (31 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు.

జేపీ డుమిని ధనాధన్‌
వన్‌డౌన్‌లో వచ్చిన జీన్‌ పాల్‌ డుమిని ధనాధన్‌ దంచికొట్టాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న డుమిని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో వేన్‌ పార్నెల్‌ (18 బంతుల్లో 35 నాటౌట్‌) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ బౌలర్లలో లియామ్‌ ప్లంకెట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. రియాన్‌ సైడ్‌బాటమ్‌, కెప్టెన్‌ రవి బొపార చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభమే దక్కింది. 

మలాన్‌ హాఫ్‌ సెంచరీ వృథా
ఓపెనర్లలో రవి బొపార (11 బంతుల్లో 27) ఓ మోస్తరుగా రాణించగా.. డేవిడ్‌ మలాన్‌ భారీ అర్ధ శతకం (51 బంతుల్లో 88) బాదాడు. మిడిలార్డర్‌లో మొయిన్‌ అలీ (37) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వారంతా విఫలమయ్యారు.

సమిత్‌ పటేల్‌ (5), ఫిల్‌ మస్టర్డ్‌ (1), ఒవైస్‌ షా (3)సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు నమోదు చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా.. ప్లంకెట్‌ (7*), టైమల్‌ మిల్స్‌ (1*) చేతులెత్తేశారు. దీంతో సౌతాఫ్రికా తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది.

ప్రొటిస్‌ బౌలర్లలో వేన్‌ పార్నెల్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. హార్డన్‌ విల్జోన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, షాన్‌వాన్‌ బెర్గ్‌, ఆరోన్‌ ఫాంగిసో తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా సౌతాఫ్రికా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నాలుగూ గెలిచి ఎనిమిది పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. 

చదవండి: SA vs AUS: సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆస్ట్రేలియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement