SA vs AUS: సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆస్ట్రేలియా | SA vs AUS 1st Test Durban: Australia Beat South Africa By 214 Runs | Sakshi
Sakshi News home page

SA vs AUS: సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆస్ట్రేలియా

Oct 13 2026 5:20 PM | Updated on Oct 13 2026 5:52 PM

SA vs AUS 1st Test Durban: Australia Beat South Africa By 214 Runs

PC: CSA/CA X

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 214 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మ్యాచ్‌ ఆరంభంలో తడబడ్డా అనూహ్య రీతిలో పుంజుకుని బవుమా బృందానికి ఊహించని షాకిచ్చింది.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ప్రొటిస్‌- రన్నరప్‌ కంగారూ జట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది.

కష్టాల నుంచి గట్టెక్కించిన రెన్షా
డర్బన్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆరంభంలో ప్రొటిస్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కంగారూలు కష్టాల్లో పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మ్యాట్‌ రెన్షా వీరోచిత శతకంతో అదరగొట్టాడు. మొత్తంగా 397 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 190 పరుగులు చేసిన రెన్షా.. తృటిలో డబుల్‌ సెంచరీ మిస్సయ్యాడు.

ఇక కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (43) రెన్షాకు సహకారం అందించాడు. ఫలితంగా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్‌ ముల్దర్‌ నాలుగు, మార్కో యాన్సెన్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అన్రిచ్‌ నోర్జే రెండు, సైమన్‌ హార్మర్‌ ఒక వికెట్‌ తీశారు.

284 పరుగులకే ఖేల్‌ ఖతం
అనంతరం బ్యాటింగ్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్‌స్లో 284 పరుగులకే చాపచుట్టేసింది. డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ (49), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (32), సైమన్‌ హార్మర్‌ (35 నాటౌట్‌), కేశవ్‌ మహరాజ్‌ (34), వియాన్‌ ముల్దర్‌ (30) చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. కంగారూ జట్టు బౌలర్లలో కెప్టెన్‌ కమిన్స్‌ మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌ తలా రెండు.. బ్యూ వెబ్‌స్టర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్యం విధించిన కంగారూలు
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌ను 314/6 వద్ద డిక్లేర్‌ చేసింది. మ్యాట్ రెన్షా (82) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోగా.. నిక్‌ మాడిసన్‌ (48), బ్యూ వెబ్‌స్టర్‌ (39 నాటౌట్‌) రాణించారు. ఈసారి నోర్జే, మహరాజ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్‌, సైమన్‌ హార్మర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

చేతులెత్తేసిన ప్రొటిస్‌ జట్టు
కాగా ఆసీస్‌ విధించిన 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక సౌతాఫ్రికా చేతులెత్తేసింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (75), వన్‌డౌన్‌ బ్యాటర్‌ బెడింగ్‌హామ్‌ (46) రాణించగా.. ముల్దర్‌ 29, యాన్సెన్‌ 35 పరుగులు చేయగలిగారు.

మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. బవుమా, స్టబ్స్‌, వెరియెన్నె, మహరాజ్‌ ఒక్కో పరుగు చేయగా.. రియాన్‌ రికెల్టన్‌ 2, నోర్జే 4 పరుగులు చేశారు. హార్మర్‌ డకౌట్‌ అయ్యాడు. 

అదరగొట్టిన హాజిల్‌వుడ్‌
ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌ ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. మ్యాట్‌ రెన్షా రెండు, స్టార్క్‌, కమిన్స్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో ఆసీస్‌ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రొటిస్‌- ఆసీస్‌ మధ్య ఆదివారం మొదలయ్యే రెండో టెస్టుకు గెబెర్హ వేదిక.

చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్‌ అవ్వండి: యువీ, గంభీర్‌ కెరీర్లు అలా ఖతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement