Sakshi News home page

WC 2023: వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనలిస్టులు ఆ జట్లే.. ఆ రెండు మాత్రం పక్కా! నేనైతే..

Published Thu, Jun 29 2023 4:19 PM

WC 2023 Sehwag Names 2 Teams Will Surely Be In Semis - Sakshi

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 రూపంలో క్రికెట్‌ ప్రేమికులకు మరో పండుగ రాబోతోంది. భారత్‌ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా ఈవెంట్‌ మొదలుకానుంది. ఈ క్రమంలో వంద రోజుల ముందుగానే(మంగళవారం) అంతర్జాతీయ క్రికెట్‌ మండలి షెడ్యూల్‌ను ప్రకటించింది. 

దీంతో క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెపుడు ఈ ఈవెంట్‌ మొదలవుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మరికొంత మంది సెమీస్‌ చేరే జట్లు, విజేతగా నిలిచే జట్టుపై అంచనా వేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

టాప్‌-4లో ఉండే జట్లు ఇవే
కేవలం ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం వన్డే ప్రపంచకప్‌-2023లో టాప్‌-4లో నిలవలగల సత్తా ఉన్న జట్లను ఎంచుకున్నాడు. 

ఐసీసీ ఈవెంట్‌ సందర్భంగా వీరూ మాట్లాడుతూ.. ‘‘నేను నాలుగు జట్లను ఎంచుకోవాలంటే.. నా మదిలో మెదిలే పేర్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, ఇండియా, పాకిస్తాన్‌. ఈసారి సెమీ ఫైనలిస్టులు ఈ జట్లే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ అయితే కచ్చితంగా టాప్‌-4లో ఉంటాయి.

ఆ రెండు టీమ్‌లు పక్కా
ఎందుకంటే వాళ్లు సంప్రదాయ షాట్లు ఆడరు.. రొటీన్‌కి భిన్నంగా ఉంటారు. అద్భుతమైన ఆట తీరుకు ఈ జట్లు పెట్టింది పేరు. అంతేకాదు మిగతా జట్లతో పోలిస్తే ఉపఖండంలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మెరుగ్గా రాణించగలవు’’ అని అభిప్రాయపడ్డాడు.

ఇక శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ మాట్లాడుతూ.. ఈ టోర్నీలో టీమిండియా- ఇంగ్లండ్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనుండటం భారత్‌కు కలిసి వచ్చే అంశమే అయినా.. ఇంగ్లండ్‌ కూడా గట్టిపోటీనిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది.

ఇక భారత్‌లో జరుగునున్న ఈ మెగా టోర్నీకి ఆతిథ్య టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం వెస్టిండీస్‌, శ్రీలంక వంటి ఒకప్పటి మేటి జట్లతో పాటు పసికూనలు క్వాలిఫైయర్స్‌లో పోటీపడుతున్నాయి.

చదవండి: CWC Qualifiers 2023: హ్యాట్రిక్‌ సెంచరీ.. జట్టును వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా!

Advertisement

What’s your opinion

Advertisement