WC 2022: అతడి ఆట తీరుపై మాకెలాంటి ఆందోళన లేదు! సంతృప్తిగా ఉన్నాం: ద్రవిడ్‌

WC 2022 Ind Vs Ban: Rahul Dravid On KL Rahul Failure Gives Clarity - Sakshi

T20 World Cup 2022- India Vs Bangladesh: ‘‘అతడు అద్భుతమైన ఆటగాడు. ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. నాకు తెలిసి ఇప్పటికీ తన బ్యాటింగ్‌ బాగానే ఉంది. టీ20 ఫార్మాట్‌లో అప్పుడప్పుడూ ఇలాంటి జరగడం సహజమే’’ అంటూ టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు అండగా నిలిచాడు. అతడికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశాడు.

సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు
టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రాహుల్‌ పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌(4), నెదర్లాండ్స్‌(9), సౌతాఫ్రికా(9)తో మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్‌ను తప్పించి అతడి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌ పంపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రాహుల్‌ ద్రవిడ్‌ (ఫైల్‌ ఫొటో)

మాకు పూర్తి నమ్మకం ఉంది
ఇదిలా ఉంటే.. సూపర్‌-12లో భాగంగా తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రాహుల్‌ గురించి ఎదురైన ప్రశ్నలపై అతడు స్పందించాడు.

‘‘మేజర్‌ టోర్నీల్లో ఆడటం సవాలుతో కూడుకున్నది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ వంటి బౌలర్లను ఎదుర్కొన్న రాహుల్‌ 60- 70 పరుగులు చేయగలిగాడు. తదుపరి మ్యాచ్‌లలో అతడు రాణిస్తాడనే భావిస్తున్నాం. 

తనకు ఆ విషయం తెలుసు
తన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది. ఆసీస్‌ పిచ్‌ పరిస్థితులపై అతడు చక్కగా ఆడగలడు. తన ఆట తీరు పట్ల మేము సంతృప్తిగానే ఉన్నాం’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఇక గాయాల బారిన పడ్డ రాహుల్‌కు గతేడాది కాలంగా తాము అండగా ఉంటున్న విషయం తెలుసునన్న ద్రవిడ్‌.. బయటి వ్యక్తుల విమర్శల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

విమర్శకులకు కౌంటర్‌
తమ ఆటగాళ్లపై తమకు నమ్మకం ఉందని.. కఠిన పరిస్థితులు ఎదురైన వేళ తప్పక వారికి అండగా ఉంటామని విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. రాహుల్‌ ఆట తీరు గురించి తమకు ఏమాత్రం ఆందోళన లేదని.. అతడికి తమ మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించాడు. తనదైన రోజు అతడు చెలరేగగలడని ద్రవిడ్‌ ధీమా వ్యక్తం చేశాడు. 

చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియాలో మూడు మార్పులు!?
ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచేందుకు వచ్చింది.. మేము వారిని ఓడించేందుకే వచ్చాం..!
VVS Laxman: డాక్టర్‌ కాబోయి క్రికెటర్‌! ఆసీస్‌ అంటే ఆకాశమే హద్దు.. ఆ హీరోచిత ఇన్నింగ్స్‌ చిరస్మరణీయం! ఈ విషయాలు తెలుసా

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top