Virat Kohli: ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్‌-10లోకి దూసుకొచ్చిన 'కింగ్‌' కోహ్లి

Virat Kohli Storms Back Top 10-Suryakumar Drops No-3 ICC T20 Batting - Sakshi

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌(53 బంతుల్లో 82 నాటౌట్‌) ఆడిన టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎగబాకాడు. టి20 ప్రపంచకప్‌కు ముందు 14వ స్థానంలో ఉన్న కోహ్లి.. పాక్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌తో టాప్‌-10లో చోటుదక్కించుకన్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో కింగ్‌ కోహ్లి 635 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

పాక్‌పై మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కోహ్లి ఆరు స్థానాలు ఎగబాకాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ అనంతరం కోహ్లి ఐసీసీ టి20 టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కూడా పెద్దగా రాణించని కోహ్లి 4 టి20లు కలిపి 81 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఆసియా కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. రెండు అర్థసెంచరీలతో పాటు అఫ్గానిస్తాన్‌పై సూపర్‌ శతకంతో అలరించాడు. అయితే సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మళ్లీ అదే టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడి టాప్‌-10లోకి వచ్చాడు. ఇక టీమిండియా నుంచి టాప్‌-10లో ఇద్దరు మాత్రమే ఉన్నారు.

మొన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ 828 పాయింట్లతో తాజాగా మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన డెవాన్‌ కాన్వే 831 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా.. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మాత్రం 849 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన బాబర్‌ ఆజం 799 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా హిట్టర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 762 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

చదవండి: టీ20లకు కోహ్లి గుడ్‌ బై చెప్పాలి.. ఎందుకంటే! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top