టీ20లకు కోహ్లి గుడ్‌ బై చెప్పాలి.. ఎందుకంటే! నీ చచ్చు సలహాలు ఆపు! కింగ్‌ ఉంటే మీ ‘ఆట’లు సాగవనా?

Ind Vs Pak: Shoaib Akhtar Wants Kohli To Retire From T20Is Because - Sakshi

T20 World Cup 2022- India Vs Pakistan- Virat Kohliటీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. నిలకడలేమి ఫామ్‌తో విమర్శల పాలైన ఈ రన్‌మెషీన్‌ ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో శతకంతో తిరిగి పూర్వవైభవం సాధించాడు. దీంతో ఎన్నో అంచనాల నడుమ పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి విలువైన ఇన్నింగ్స్‌ ఆడి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం
‘టీ20లకు కోహ్లి పనికిరాడు.. రిటైర్‌ అయితే మంచిదంటూ’ ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ వచ్చిన వార్తలు కింగ్‌ అభిమానులను కలవరపెట్టగా.. వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ టీ20లో తన సత్తా ఏమిటో మరోసారి ఘనంగా చాటాడు. 

అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌
ఈ క్రమంలో కోహ్లిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. కోహ్లి ఇక టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అయితే బాగుంటుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా అతడు వెల్లడించాడు.

భారత్‌- పాకిస్తాన్‌ ఫలితంపై తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌.. ‘‘పాకిస్తాన్‌ అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లూ.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నిజానికి ఇండియా మనకంటే అత్యద్భుతంగా ఆడింది.

అందుకే వాళ్లు చరిత్రలో గుర్తుండిపోయే మ్యాచ్‌ గెలిచారు. రనౌట్లు, నో బాల్‌ వివాదం, స్టంపింగ్‌లు అన్నీ ఉన్నాయి. అయితే, టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఇండియా- పాకిస్తాన్ తప్పక మరోసారి తలపడతాయి. పాక్‌కు మరో అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.

కోహ్లిపై ప్రశంసలు కురిపిస్తూనే
ఇక 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించిన కోహ్లి ఇన్నింగ్స్‌ గురించి అక్తర్‌ ప్రస్తావిస్తూ.. ‘‘మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఒక్కసారి పైకి లేచామంటే మునుపటి వైభవం సాధించవచ్చు.

పట్టుదలగా ఆడి మనమేంటో నిరూపించుకోవచ్చు. విరాట్‌ కోహ్లి చేస్తున్నది అదే! తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్‌ అతడు ఆడేశాడు. తనపై తనకున్న నమ్మకం, తన పట్టుదలే అతడి విజయానికి కారణం’’ అంటూ ప్రశంసించాడు.

రిటైర్‌ అవ్వాలి.. ఎందుకంటే!
‘‘కోహ్లి అదిరిపోయే ఇన్నింగ్స్‌తో తిరిగి వచ్చాడు. అయితే, తను టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ బాగుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. తన శక్తిసామర్థ్యాలన్నింటినీ కేవలం టీ20లకే పరిమితం చేయడం సరికాదు. 

పాక్‌తో ఆడిన ఇన్నింగ్స్‌ మాదిరే వన్డేల్లోనూ చెలరేగాలి. ఓ మూడు సెంచరీలు సాధించాలి’’ అంటూ అక్తర్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘కోహ్లి ఉంటే మీ ఆటలు సాగవనే ఇలా చెబుతున్నావా? కింగ్‌ ఎప్పటికీ, ఎక్కడున్నా కింగే! ఫార్మాట్‌ ఏదైనా తను బ్యాట్‌ ఝులిపించగలడు. 

సెంచరీలు తనకేమీ కొత్త కాదు... నీ చచ్చు సలహాలు అక్కర్లేదు గానీ.. పోయి పని చూసుకో’’ అంటూ కోహ్లి ఫ్యాన్స్‌ అక్తర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. కాగా పాక్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా వరల్డ్‌కప్‌-2022 ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది.

చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌
కండరాల నొప్పి?! స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌?! కోచ్‌ క్లారిటీ.. అన్ని మ్యాచ్‌లు ఆడతాడంటూ
WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top