IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్‌ కోహ్లి! ఇప్పటికే...

Virat kohli Lead Rcb again in Ipl Says Report - Sakshi

ఐపీఎల్‌-2021 సీజన్‌ తర్వాత రాయల్‌ ఛాలంజెర్స్‌ బెంగళూరు కెప్టెన్సీకి  విరాట్‌ కోహ్లి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో  విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఐపీఎల్‌-2022లో ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లి బాధ్యతలు చేపట్టనున్నడన్నది ఆ వార్త సారాంశం. ఈ మేరకు ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే కోహ్లితో చర్చలు జరిపిందంట.

కాగా 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి.. ఒక్కసారి కూడా జట్టును ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. ఈ కారణంతోనే కోహ్లి తప్పుకున్నాడని ఊహాగానాలు వినిపించాయి. అయితే కోహ్లి మాత్రం తనపై భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే, అనూహ్య పరిణామాల నేపథ్యంలో విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారు. దీంతో.. కోహ్లి ప్రస్తుతం కేవలం టెస్టులకు మాత్రమే సారథ్యం వహిస్తున్నాడు. తద్వారా అతడిపై కెప్టెన్సీ భారం తగ్గింది. ఈ క్రమంలోనే కోహ్లి కూడా మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టి తానేంటో మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా కోహ్లి స్థానంలో ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్‌ అవుతాడని అంతా భావించారు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుని ఏబీడీ అందరనీ షాక్‌ గురిచేశాడు. డివిలియర్స్‌ తప్పుకోవడంతో మళ్లీ కోహ్లి వైపే యాజమాన్యం మెగ్గు చూపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌ మెగా వేలంకు ముందు ఆర్సీబీ విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌లను రీటైన్‌ చేసుకుంది. మరో వైపు ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ కూడా ఆర్సీబీ జట్టులో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ కూడా కెప్టెన్‌గా ఆర్సీబీకి ఒక ఆప్షన్‌గా ఉండవచ్చు.

చదవండి: SA vs IND: ద్రవిడ్‌ రికార్డును కోహ్లి అధిగమిస్తాడా ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top