Virat Kohli Highest Runs: సెంచరీ చేయకపోతేనేం.. ఇప్పటికీ అతనే లీడింగ్‌ రన్‌ స్కోరర్‌..!

Virat Kohli Is Indias Highest Run Scorer In All Three Formats Since 2020 - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌లో లేడని, సెంచరీ సాధించి దాదాపు 1000 రోజులవుతందని నానా యాగీ చేస్తున్న వారికి ఈ గణాంకాలు చెంప పెట్టేనని చెప్పాలి. 2020 నుంచి మూడు ఫార్మాట్లలో కోహ్లి సాధించినన్ని పరుగులు ఏ ఇతర భారత బ్యాటర్‌ చేయలేదన్నది కాదనలేని సత్యం. కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. అతని ప్రదర్శన మాత్రం ఏమంత తీసికట్టుగా లేదనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. 2020 నుంచి 2022 ఇంగ్లండ్‌ సిరీస్‌ వరకు మూడు ఫార్మాట్లలో 79 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి సెంచరీ మార్కు ఒక్కసారి కూడా అందుకోనప్పటికీ 34.95 సగటున 2237 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లి తర్వాత ఇటీవలే విండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌ (22) ఈ మధ్యకాలంలో ఇన్ని అర్ధసెంచరీలు సాధించాడు. 

ఈ మధ్యకాలంలో కోహ్లి మినహా మరే ఇతర భారత క్రికెటర్‌ ఇన్ని పరుగులు చేయలేదు. ఓవరాల్‌గా చూసినా 2020 తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 3508 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (3099) రెండో స్థానంలో, బంగ్లా ఆటగాడు లిటన్‌ దాస్‌ (2754), పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (2656), ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిన్‌స్టో (2609), సఫారీ ప్లేయర్‌ డస్సెన్‌ (2244)లు వరుసగా 3 నుంచి ఆరు స్థానాల్లో నిలిచారు. 

కోహ్లి తర్వాత టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్‌ పంత్‌ (2097), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2039) 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే కోహ్లి ఫామ్‌ సహచర టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉందనే చెప్పాలి. సెంచరీ చేయలేకపోతున్నాడన్న లోటు తప్పిస్తే కోహ్లి ప్రదర్శన పర్వాలేదని అనాలి. విమర్శకులు, విశ్లేషకులు, ఫ్యాన్స్‌ ఒత్తిడి అధికమై  మూడంకెల స్కోర్‌ సాధించలేకపోతున్నాడే తప్పా.. కోహ్లికి ఉన్న సత్తాకు సెంచరీ సాధించడం​ ఏమంత విషయం కాదనే చెప్పాలి. ఈ గణాంకాలు చూసిన కోహ్లి అభిమానులు తమ బాస్‌ ఇప్పటికీ రన్‌మెషీనేనని.. త్వరలో జరుగబోయే జింబాబ్వే సిరీస్‌లో 71వ సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయిస్తాడని ఛాలెంజ్‌ చేస్తున్నారు. 


చదవండి: అనుష్కతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన కోహ్లి.. చాలా సంతోషం.. ఫొటో వైరల్‌
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top