Vince Mcmahon: WWEకి విన్స్‌ మెక్‌మ్యాన్‌ రిటైర్మెంట్‌

Vince McMahon Announce Retirement For WWE - Sakshi

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(WWE) చైర్మన్‌, సీఈవో విన్స్‌ మెక్‌మ్యాన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తన పదవులతో పాటు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈకి వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం విన్స్‌ మెక్‌మ్యాన్‌ ఒక ప్రకటనలో తెలిపాడు.

''నా వయసు 76 ఏళ్లు.. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. అందుకే ఈ రిటైర్మెంట్‌. ఇన్నేళ్లలో ఎంతో మంది రెజ్లర్లను తీసుకొచ్చాను. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఎన్నో ఏళ్ల పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చాననే ఆశిస్తున్నా. నాతో పాటు నా కుటుంబం కూడా భాగస్వామ్యం కావడం సంతోషాన్నిచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ అనే బ్రాండ్‌ ఇప్పట్లో ఎవరు తుడిచేయలేరు. నా తర్వాతి తరం దానిని కొనసాగిస్తారు.'' ఉద్వేగంతో ప్రకటించాడు. 

ఇక విన్స్‌ మెక్‌మ్యాన్‌ స్థానంలో తన అల్లుడు ట్రిపుల్‌ హెచ్‌(పాల్‌ మైకేల్‌ లెవెస్క్యూ) ఇకపై ఆ బాధ్యతలు చూసుకుంటాడని బోర్డు తెలిపింది. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్‌ కెనెడీ మెక్‌మ్యాన్‌.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్‌ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్‌ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రారాజుగా ఎదిగాడు.

కాగా రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలో విన్స్‌ మెక్‌మ్యాన్ గతంలోనే చైర్మన్‌, సీఈవో పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకున్నాడు. మాజీ ఉద్యోగితో ఎఫైర్‌ నడిపిన విన్స్‌.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు  కొన్నిరోజల  ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. దీంతో మెక్‌మ్యాన్‌ తన చైర్మన్‌, సీఈవో పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు. మెక్‌మ్యాన్‌ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్‌కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది. తాజాగా వయసు దృశ్యా డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.

డబ్ల్ల్యూడబ్ల్యూఈలో విన్స్‌ మెక్‌మ్యాన్‌ ఘనతలు
►ఈసీడబ్ల్యూ వరల్డ్‌ చాంపియన్‌(ఒకసారి)
►డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ చాంపియన్‌(ఒకసారి)
►రాయల్‌ రంబుల్‌ విజేత(1999)
►మ్యాచ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: 2006లో వ్రెసల్‌మేనియా 22లో భాగంగా షాన్‌ మెకెల్స్‌తో ఆడిన మ్యాచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top