శతక్కొట్టిన దీపక్‌ హుడా.. చెలరేగిన చాహర్‌ బ్రదర్స్‌ | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన దీపక్‌ హుడా.. చెలరేగిన చాహర్‌ బ్రదర్స్‌

Published Fri, Nov 24 2023 8:56 AM

Vijay Hazare Trophy 2023: Deepak Hooda, Chahar Brothers Shines As Rajasthan Beat Arunachal Pradesh By 161 Runs - Sakshi

దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్‌ 23) జరిగిన మ్యాచ్‌ల్లో మయాంక్‌ అగర్వాల్‌ (157), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (71), యుజ్వేంద్ర చహల్‌ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్‌ ప్లేయర్స్‌ దీపక్‌ హుడా (114, 1/5), దీపక్‌ చాహర్‌ (66 నాటౌట్‌), రాహుల్‌ చాహర్‌ (5/34) రాణించారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. దీపక్‌ హుడా, మానవ్‌ సుథర్‌ (41), దీపక్‌ చాహర్‌ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో నబమ్‌ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్‌ సెరా 2, అక్షయ్‌ జైన్‌, తెచి డోరియా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. రాహుల్‌ చాహర్‌, మానవ్‌ సుథర్‌ (10-2-36-2), ఖలీల్‌ అహ్మద్‌ (7.2-0-44-2), దీపక్‌ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో సచిన్‌ శర్మ (63), అప్రమేయ జైస్వాల్‌ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా  ఆటగాళ్లంతా విఫలమయ్యారు. 

హైదరాబాద్‌ బోణీ..
జైపూర్‌: విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్‌ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్‌ రెడ్డి (2/28), తనయ్‌ త్యాగరాజన్‌ (2/24) రాణించారు.

అనంతరం హైదరాబాద్‌ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్‌ కెపె్టన్‌ గౌవ్లత్‌ రాహుల్‌ సింగ్‌ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్‌ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.   

ఆంధ్ర పరాజయం.. 
మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్‌ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్‌ (78 నాటౌట్‌; 11 ఫోర్లు), ఆకాశ్‌ వశిష్ట్‌ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. 

Advertisement
Advertisement