
రాజస్తాన్ బ్యాటర్లు అభిజిత్-కునాల్ బిగ్ పార్ట్‌నర్‌షిప్ (PC: BCCI Domestic X)
Vijay Hazare Trophy 2023 Title Winner: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2023 టైటిల్‌ను హరియాణా గెలుచుకుంది. రాజ్‌కోట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. కాగా విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచిన హరియాణా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
అర్ధ శతకాలతో అదరగొట్టారు
ఓపెనర్ అంకిత్ కుమార్(88), కెప్టెన్ అశోక్ మెనేరియా(70) అర్ధ శతకాలు సాధించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన వేళ హరియాణా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 287 పరుగులు సాధించింది.
పోరాడి ఓడిన రాజస్తాన్
ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్ అభిజిత్ తోమర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడి సెంచరీ(129 బంతుల్లో 106 పరుగులు) సాధించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ కునాల్ సింగ్ రాథోడ్ 79 పరుగులతో రాణించాడు.
అయితే, మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడం రాజస్తాన్ జట్టుపై ప్రభావం చూపింది. ఆఖరి వరకు పట్టుదలగా పోరాడినా హరియాణా బౌలర్లే పైచేయి సాధించారు. ఈ క్రమంలో 48 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌట్ అయిన రాజస్తాన్.. హరియాణా చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక హరియాణా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ రెండు, హర్షల్ పటేల్, సుమిత్ కుమార్ మూడేసి వికెట్లు దక్కించుకోగా.. రాహుల్ తెవాటియా రెండు వికెట్లు తీశాడు.