Sarfaraz Khan: ఆసుపత్రి నుంచి డిశ్చార్జై వచ్చాడు.. మరో సెంచరీ కొట్టాడు

VHT 2022 Mumbai VS Railways: Sarfaraz Khan Scores Yet Another Century - Sakshi

దేశవాలీ క్రికెట్‌లో అభినవ బ్రాడ్‌మన్‌గా పిలుచుకునే ముంబై రన్‌ మెషీన్ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరో సెంచరీ బాదాడు.విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో భాగంగా బుధవారం (నవంబర్‌ 23) రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టి తన జట్టును గెలిపించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రైల్వేస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (94 బంతుల్లో 117; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్‌ ఆజింక్య రహానే (82 బంతుల్లో 88; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (47 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ముంబైని విజయతీరాలకు (48.3 ఓవర్లలో 338/5) చేర్చారు.  

కాగా, ఈ  మ్యాచ్‌కు ముందు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. డిశ్చార్జ్‌ అయిన వెంటనే రెస్ట్‌ కూడా తీసుకోకుండా నేరుగా వచ్చి సెంచరీ బాదడం అందరినీ ఆశ్చర్యపరిచింది.సర్ఫరాజ్‌ సాహసానికి ముగ్దులైన అభిమానులు అతన్ని వేనోళ్లతో పొగుడుతున్నారు. ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగడమే ఓ ఎత్తైతే, సెంచరీ బాది మరీ గొప్పతనాన్ని చాటుకున్నాడంటూ ఆకాశానికెత్తుతున్నారు. సర్ఫరాజ్‌ గురించి బాగా తెలిసిన వాళ్లైతే.. వీడు టీమిండియాలో చోటు దక్కేంతవరకు సెంచరీలు బాదుతూనే ఉంటాడని అంటున్నారు.

కాగా, దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతనికి భారత జట్టులో చోటు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ను ఇటీవలే సెలెక్టర్లు కరుణించారు.త్వరలో బంగ్లాదేశ్‌లో జరుగనున్న అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లకు అతన్ని ఎంపిక చేశారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top