భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసుకే దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా లీగ్‌లో వైభవ్‌ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ బుడ్డోడి బీభత్సం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. త్వరలో ఇతగాడిని టీమిండియాకు ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అంటూ వేనోళ్లు కొనియాడుతున్నాయి.
తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌ను పొగుడుతూనే, ఓ సరదా కామెంట్ చేశాడు. వైభవ్ ఇదే జోరును కొనసాగిస్తే 21 ఏళ్లకే బర్నౌట్ అవుతాడని అన్నాడు. ఆ వయసుకే కావాల్సినంత డబ్బు సంపాదించుకొని రిటైరవుతాడని చమత్కరించాడు. ‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్‌లో టఫ్నెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ లాంటి ఇతర ఇంగ్లండ్ దిగ్గజాలతో కలిసి పాల్గొన్న ఈ షోలో టఫ్నెల్ వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతడి ఐపీఎల్ 2026 ప్రదర్శనలను కొనియాడాడు.
తరుచూ టీమిండియా క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కే మైఖేల్ వాన్ కూడా వైభవ్‌ను ఈ సందర్భంగా ప్రశంసించాడు. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర యోధుడు కెరీర్ మధ్యలో 30 బంతుల్లో సెంచరీ చేస్తే వైభవ్ కెరీర్ ప్రారంభంలో, అదీ 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతక్కొట్టాడని కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లు కొట్టి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడని అన్నాడు.
మరో ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ వైభవ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ సిక్స్ హిట్టర్ అని ఆకాశానికెత్తాడు. మొత్తంగా తొలిసారి ఇంగ్లండ్ దిగ్గజాలంతా వైభవ్‌ను ముక్తకంఠంతో కొనియాడారు.
కాగా, 2011 మార్చి 27న జన్మించిన వైభవ్.. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్‌లో చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అతడి విధ్వంసం తారాస్థాయిలో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్.. 40.40 సగటున, 237.65 స్ట్రయిక్‌రేట్‌తో ఓ సెంచరీ, రెండు అర్ద సెంచరీల సాయంతో 404 పరుగులు చేసి, తన జట్టు (రాజస్థాన్ రాయల్స్) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.


