యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎంట్రీ.. రోహన్‌ బొపన్న సరికొత్త రికార్డు | US Open 2023: Rohan Bopanna Creates History By Entering Finals - Sakshi
Sakshi News home page

US Open: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎంట్రీ.. రోహన్‌ బొపన్న సరికొత్త రికార్డు

Published Fri, Sep 8 2023 2:25 PM

US Open 2023: Rohan Bopanna Creates History By Enters Final - Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బొపన్న ఓపెన్‌ శకంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్‌ ఓపెన్‌-2023 పురుషుల డబుల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ బొపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఈ జోడీ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 7–6 (7/3), 6–2తో పియరీ హ్యూజ్‌ హెర్బర్ట్‌–నికోలస్‌ మహుట్‌ (ఫ్రాన్స్‌) జంటను ఓడించింది.

94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బొపన్న జోడీ తన ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. రాజీవ్‌ రామ్‌ (అమెరికా)–సాలిస్‌బరీ (బ్రిటన్‌); ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో బొపన్న జంట తలపడుతుంది.

తాజా ఫలితంతో 43 ఏళ్ల బొపన్న ఓపెన్‌ శకంలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో బొపన్న గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010లో ఐజామ్‌  ఖురేషి (పాకిస్తాన్‌)తో జతకట్టి యూఎస్‌ ఓపెన్‌లోనే ఫైనల్‌ చేరిన బోపన్న తుది పోరులో బాబ్‌ బ్రయాన్‌–మైక్‌ బ్రయాన్‌ (అమెరికా) ద్వయం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.  

 
Advertisement
 
Advertisement