Bhavinaben Patel: రజత సంబరం

Tokyo 2020 Paralympic: Bhavinaben Patel wins historic silver medal in TT - Sakshi

టీటీలో భవీనాబెన్‌ పటేల్‌... హైజంప్‌లో నిశాద్‌లకు రజతాలు

డిస్కస్‌ త్రోలో వినోద్‌కు కాంస్యం

ప్రత్యర్థుల ఫిర్యాదుతో వినోద్‌ ఫలితం నిలిపివేత

సమీక్ష అనంతరం నేడు తుది నిర్ణయం

జాతీయ క్రీడా దినోత్సవాన టోక్యో పారాలింపిక్స్‌ క్రీడల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒకేరోజు ఏకంగా మూడు పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్లాస్‌–4 సింగిల్స్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ రజత పతకం సొంతం చేసుకోగా... పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి–47 విభాగంలో నిశాద్‌ కుమార్‌ కూడా రజత పతకం కైవసం చేసుకున్నాడు.

పురుషుల అథ్లెటిక్స్‌ డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 విభాగంలో భారత ప్లేయర్‌ వినోద్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. అయితే వినోద్‌తో పోటీపడిన ప్రత్యర్థులు అతడి వైకల్యం స్థాయిపై సందేహం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దాంతో డిస్కస్‌ త్రో ఫలితాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పతకాల ప్రదానోత్సవాన్ని నేటికి వాయిదా వేశారు. నేడు ఫిర్యాదుపై విచారించి వినోద్‌కు పతకం ఇవ్వాలా వద్దా అనేది నిర్వాహకులు తేలుస్తారు.

టోక్యో: ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌కు నిరాశ ఎదురైంది. టోక్యో పారాలింపిక్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన టీటీ మహిళల సింగిల్స్‌ క్లాస్‌–4 విభాగం ఫైనల్లో భవీనాబెన్‌ పటేల్‌ 7–11, 5–11, 6–11తో ప్రపంచ నంబర్‌వన్‌ యింగ్‌ జౌ (చైనా) చేతిలో ఓడిపోయింది.

19 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యింగ్‌ జౌ నిలకడగా పాయింట్లు స్కోరు చేసింది. లీగ్‌ దశలోనూ యింగ్‌ జౌతో జరిగిన మ్యాచ్‌లో భవీనా పరాజయం చవిచూసింది. ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడిన గుజరాత్‌కు చెందిన 34 ఏళ్ల భవీనా అబ్బురపరిచే ఆటతీరుతో ఎవరూ ఊహించని విధంగా రజత పతకాన్ని సాధించింది.

రజత పతకం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. అయితే పతకం స్వర్ణమై ఉంటే ఇంకా సంతోషం కలిగేది. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంటే మహిళలు ఎన్నో అద్భుతాలు చేయగలరు. రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించినా సాంకేతిక కారణాలతో నేను ఆ క్రీడలకు దూరమయ్యాను. ‘రియో’లో చేజారిన అవకాశం నాలో కసిని పెంచింది. పతకం గెలిచేందుకు దోహదపడింది. వైకల్యం కారణంగా నేను జీవితంలో పడిన ఇబ్బందులు తర్వాతి తరంవారు ఎదుర్కోకూడదని కోరుకుంటున్నాను. దైనందిన జీవితంలో దివ్యాంగులకు ప్రతి చోటా క్లిష్ట పరిస్థితులే ఎదురవుతాయి. ఉద్యోగాలతోపాటు ఇతర రంగాల్లోనూ వారికి సముచిత స్థానం ఇవ్వాలి. నా పతకం ద్వారా దివ్యాంగులకు ఏదైనా మేలు జరిగితే అంతకంటే సంతోషం మరోటి ఉండదు.  
–భవీనాబెన్‌ పటేల్‌

విశేష ప్రదర్శనతో భవీనా చరిత్ర లిఖించింది. దేశానికి రజతం అందించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. యువతను క్రీడలవైపు ఆకర్షించేలా చేస్తుంది.
–ప్రధాని మోదీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top