
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య నాలుగో టి20
రాత్రి 11 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
మాంచెస్టర్: వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టుకు గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఆతిథ్య ఇంగ్లండ్ బ్రేకులేసింది. దీంతో మూడో టి20 ఓటమితో ‘వాయిదా’ పడిన సిరీస్ విజయాన్ని మాంచెస్టర్‌లో రాబట్టాలని హర్మన్‌ప్రీత్ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అడ్డుకున్న ఇంగ్లండ్ అదే ఊపుతో ఇప్పుడు సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య బుధవారం జరిగే నాలుగో టి20 ఆసక్తికరంగా జరుగనుంది. బర్మింగ్‌హామ్ (12న ఐదో టి20) దాకా సాగదీయకుండా ఎలాగైనా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని అమ్మాయిల జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ స్మృతి మంధాన సూపర్‌ఫామ్, తెలుగమ్మాయి శ్రీచరణి స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ కంటే ఓ మెట్టుపైనే ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్, సిరీస్ విజయం ఏమంత కష్టం కానేకాదు.
హర్మన్‌ప్రీత్ రాణిస్తే...
పొట్టి సిరీస్‌లో ఎవరైనా ప్రదర్శన పరంగా బాకీ పడ్డారంటే అది కెప్టెన్ హర్మన్‌ప్రీతే! తొలి మ్యాచ్‌కు గైర్హాజరైన సారథి తర్వాత మ్యాచ్‌లాడినా... ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మూడో టి20లో హర్మన్ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి ఉంటే ఇదివరకే సిరీస్ దక్కేది. కేవలం 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గడ్డపై ‘హ్యట్రిక్’ విజయం దూరమవగా... సిరీస్ కోసం ఇంకా పోరాడాల్సి వస్తోంది.
మిగతా వారిలో గత మ్యాచ్‌లో ఓపెనర్ ఫషాలీ వర్మ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం. ఓపెనర్లతో పాటు జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌లు కూడా రాణిస్తే... రిచా ఘోష్ తన హిట్టింగ్‌తో ఆదరగొట్టేందుకు అవకాశముంటుంది. ఈ సిరీస్‌లో శ్రీచరణి అత్యంత నిలకడగా స్పిన్నేస్తోంది. అరుంధతి రెడ్డి, దీప్తి శర్మలు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎలా చూసినా కూడా భారత బౌలింగ్ దళం మెరుగ్గానే ఉంది.
సమం కోసమే సమరం
ఈ సిరీస్‌లోనే నిలకడలేమి ఆటతీరుతో అగచాట్లు పడుతున్న ఇంగ్లండ్ గత మ్యాచ్ గెలిచిందంటే ఓపెనర్లే కారణం. సోఫియా డంక్లీ, డానీ వ్యాట్‌లు తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేశారు. కానీ గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో నిలబెట్టారు. మిగతా బ్యాటర్లను భారత బౌలర్లు తెలివిగానే బోల్తాకొట్టించారు. ఈ నేపథ్యంలో బ్యూమోంట్ సేన అందివచి్చన అవకాశాన్ని జారవిడువకుండా వరుసగా ఈ మ్యాచ్‌లోనూ పుంజుకొంటే సిరీస్ రేసులో పడొచ్చని భావిస్తోంది. పటిష్టమైన భారత బృందాన్ని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు రాణిస్తే సరిపోదని సమష్టి బాధ్యత తీసుకోవాలని అనుకుంటుంది.
తుదిజట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, అమన్‌జోత్, దీప్తిశర్మ, రాధా యాదవ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీచరణి.
ఇంగ్లండ్: టామీ బ్యూమోంట్ (కెప్టెన్ ), సోఫియా డంక్లీ, డానీ వ్యాట్, అలైస్ క్యాప్సీ, స్కాలిఫీల్డ్, అమీ జోన్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, ఇసీ వాంగ్, చార్లీ డీన్, లారెన్ ఫిలెర్, లారెన్ బెల్.