ఐపీఎల్‌ 2023లో కొత్త రూల్‌

Teams To Announce Playing XI After Toss In A New Rule Ahead Of IPL 2023 - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 నుంచి కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. ఫ్రాంచైజీలు తమ తుది జట్లను, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పేరు వివరాలను టాస్‌ తర్వాత ప్రకటించే వెసలుబాటు కల్పించింది బీసీసీఐ. దీంతో టాస్‌ గెలుపోటముల ఆధారంగా ఫ్రాంచైజీలు అత్యుత్తమ జట్టును ఎంచునే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఎంచుకునే విషయంలో ఈ కొత్త రూల్‌ చాలా ఉపయోగపడుతుంది.

తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఓ జట్టును, అదే తొలుత బౌలింగ్‌ చేయాల్సి వస్తే మరో జట్టును ఎంచకునే అవకాశం ఫ్రాంచైజీలకు దక్కుతుంది. గత సీజన్‌ వరకు కెప్టెన్లు టాస్‌కు ముందే తుది జట్లు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌  వివరాలను వెల్లడించేవారు. ఇలా చేయడం వల్ల ఫ్రాంచైజీలకు  ఉపయోగకరమైన తుది జట్టును ఎంచునే విషయంలో కాస్త అసంతృప్తి ఉండేది.

ఈ నయా రూల్‌ను గతంలో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అమలు చేశారు. ఫ్రాంచైజీలు టాస్‌ తర్వాత తుది జట్టును ప్రకటించే ముందు టీమ్‌ షీట్‌పై 13 మంది ప్లేయర్ల వివరాలను ఉంచాల్సి ఉంటుంది. ఈ జాబితా నుంచే 11 మంది ప్లేయర్లు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

కాగా, రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో మరిన్ని కొత్త రూల్స్‌ కూడా అమల్లోకి రానున్నాయి. అవేంటంటే.. నిర్దిష్ట సమయ వ్యవధిలో బౌలర్‌ ఓవర్‌ పూర్తి చేయకుంటే ఓవర్ రేట్ పెనాల్టీ ఉంటుంది. ఓవర్‌ రేట్‌ పెనాల్టీ పడితే 30 యార్డ్స్‌ సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్‌లు మాత్రమే అనుమతించబడతారు. అలాగే ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ అన్యాయమైన కదలికలకు పాల్పడితే బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి ప్రత్యర్ధికి 5 పెనాల్టీ పరుగులు ఇస్తారు.

మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2023 సీజన్‌లో పై పేర్కొన్న రూల్స్‌ అన్ని అమల్లోకి వస్తాయని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ప్రకటించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్‌ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top