India Jersey For ODI WC 2023: టీమిండియా వరల్డ్‌కప్‌ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?

Team India Jersey For CWC 2023 Changed, Tricolour On Shoulder In Place Of 3 White Stripes - Sakshi

భారత క్రికెట్‌ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్‌ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్‌ బ్లూ కలర్‌ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్‌ కలర్‌ జెర్సీలను అడిడాస్‌ ప్రవేశపెట్టింది.

జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్‌) లోగోను, ఎడమవైపు టీమ్‌ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. 

కాగా, వరల్డ్‌కప్‌ నేపథ్యంలో అడిడాస్‌ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్‌ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్‌ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది.

టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్‌ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్‌ఫుల్‌గా ఉందని అంటున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top