Michael Vaughan: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెటా..? నాన్సెన్స్‌..!

Team India Favourite For 2023 World Cup, Utter Nonsense Says Michael Vaughan - Sakshi

ODI World Cup 2023: టీమిండియాపై తరుచూ అవాక్కులు చవాక్కులు పేలే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2022లో తన జట్టు విజేతగా నిలవడంతో కళ్లు నెత్తికి ఎక్కి, భారత జట్టుపై తన నోటి దూలను మరోసారి ప్రదర్శించాడు. సందర్భంతో పని లేకుండా తరుచూ టీమిండియాపై, జట్టులోకి ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాన్‌.. ఇంగ్లండ్‌ విశ్వవిజేతగా ఆవిర్భవించడంతో గెలుపు మదంతో కొట్టుకుంటూ టీమిండియాను అవమానకర రితీలో చులకన చేసి మాట్లాడాడు.

భారత్‌ వేదికగా వచ్చే ఏడాది (2023) జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్టు ఏదనే అంశంపై ఇంగ్లీష్‌ దినపత్రిక టెలిగ్రాఫ్‌కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో టీమిండియాను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉన్నప్పటికీ ఫేవరెట్‌ జట్టు మాత్రం కాలేదని, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కే ఆ ట్యాగ్‌ తగిలించుకునే అర్హత ఉందని గొప్పలు పోయాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీమిండియాకు ఫేవరెట్‌ అనిపించుకునే అర్హత లేదని, ఇదంతా నాన్సెన్స్‌ అని అవమానకర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెట్‌ అంటే అస్సలు ఒప్పుకోనని, వరల్డ్‌కప్‌ ఎక్కడ జరిగినా ఫేవరెట్‌ జట్టుగా ఇంగ్లండే ఉంటుందని గర్వంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా లాంటి పేస్‌ అనుకూలమైన పిచ్‌లపైనే సత్తా చాటి వరల్డ్‌కప్‌ నెగ్గిన తమకు భారత పిచ్‌లపై రాణించి వరల్డ్‌కప్‌ గెలవడం పెద్ద విషయం కాదని అన్నాడు. స్వదేశంలో ఆడుతుంది ​కాబట్టి టీమిండియానే ఫేవరెట్‌ అని ఎవరైన అంటే, వారితో ఏకీభవించేది లేదని తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్‌లో ఏకైక ఫేవరెట్‌ అయిన ఇంగ్లండ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదా నిలబెట్టుకుని మెగా ఈవెంట్లలో జైత్రయాత్ర కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదే సందర్భంగా బీసీసీఐపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నేనే ఇండియన్‌ క్రికెట్‌కు బాస్‌ను అయితే, అహంకారాన్ని తగ్గించుకుని ఇంగ్లండ్‌ విన్నింగ్‌ మోడల్‌ను స్పూర్తిగా తీసుకుని ఫాలో అవుతానని అన్నాడు. మేజర్‌ టోర్నీల్లో టీమిండియా గెలవాలంటే బీసీసీఐ..  ఇంగ్లండ్‌ను ఫాలో అవ్వాలని సూచించాడు.

వాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలకు కౌంటర్లిస్తూ.. తగు రీతిలో స్పందిస్తున్నారు. వీడి నోటి దూలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది, వరల్డ్‌కప్‌ గెలుపుతో వీడి నోటికి తాళం వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి వెదవ చేసే వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: 'రోహిత్‌ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్‌ చేయండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top