T20I Annual Team Rankings: టీ20ల్లోనూ మనోళ్లదే హవా.. వరల్డ్‌ ఛాంపియన్లు కూడా మన తర్వాతే..!

Team India Extend Dominance At The Top In T20I Annual Team Rankings - Sakshi

ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన వార్షిక టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా నడిచింది. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన భారత జట్టు.. టీ20 ర్యాంకింగ్స్‌లో మరో రెండు పాయింట్లు పెంచుకుని (267) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. దీంతో జగజ్జేత, టీ20 వరల్డ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ (259) కూడా భారత్‌ తర్వాతి స్థానానికే పరిమితమైంది. టీమిండియాకు ఇంగ్లండ్‌కు మధ్య 8 పాయింట్ల వ్యత్యాసం ఉంది.  

వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ (267), ఇంగ్లండ్‌ (259) తర్వాత న్యూజిలాండ్‌ (256), పాకిస్థాన్‌ (254), సౌతాఫ్రికా (253), ఆస్ట్రేలియా (248), వెస్టిండీస్‌ (238), శ్రీలంక (237), బంగ్లాదేశ్‌ (222), ఆఫ్ఘనిస్థాన్‌ (219) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. 

కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన సిరీస్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు.

2020 మే తర్వాత టీ20ల్లో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. రోహిత్‌ సేన ఈ మధ్యకాలంలో ఆడిన ఒకే ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో (శ్రీలంక చేతిలో) మాత్రమే ఓడింది. 2022లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ సిరీస్‌ డ్రా కాగా.. మిగితా 13 సిరీస్‌ల్లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 5 నుంచి మూడో స్థానానికి చేరుకుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top