
వన్డేలకు సిద్ధం కానున్న టీమిండియా కెప్టెన్
ముంబై: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొంత విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌కు పదును పెడుతున్నాడు. తన మిత్రుడు, వ్యక్తిగత కోచ్ అయిన అభిషేక్ నాయర్‌తో కలిసి అతను మంగళవారం జిమ్ ట్రైనింగ్‌లో పాల్గొన్నాడు. రోహిత్ ఇప్పటికే టెస్టులు, టి20లనుంచి రిటైర్ కావడం, అన్ని ఫార్మాట్‌లలో కొత్త ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో వన్డేల్లో కూడా అతను కొనసాగే అంశంపై ఇటీవల చర్చ మొదలైంది.
2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే లక్ష్యంతో రోహిత్ ఉన్నా... ఇప్పటికిప్పుడు దీనిపై ఇంకా స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాయర్ పర్యవేక్షణలోనే రోహిత్ త్వరలోనే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు దిగే అవకాశం ఉంది. అతను చివరిసారిగా జూన్ 1న ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
ఆ తర్వాత భారత టెస్టు జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించగా... రోహిత్ కూడా అదే సమయంలో ఇంగ్లండ్‌లోనే సరదాగా సెలవులు గడిపాడు. ఇప్పుడు విరామం తర్వాత మళ్లీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. భారత్ తమ తర్వాతి వన్డేలో అక్టోబర్ 19న ఆ్రస్టేలియాలో బరిలోకి దిగుతుంది. 2025–26 సీజన్‌లో టీమిండియా మరో 9 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది.
ఆసీస్ టూర్‌తో పాటు స్వదేశంలోనే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో భారత్ తలపడుతుంది. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతానికి రోహిత్ వన్డేల్లో టాప్ బ్యాటర్‌గానే కొనసాగుతున్నాడు. 11,168 పరుగులు మాత్రమే కాదు, 32 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలతో అతనికి ఘనమైన రికార్డు ఉంది. భారత్ ఆడిన తమ చివరి టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో కెపె్టన్‌గా జట్టును విజేతగా నిలపడంతో పాటు ఫైనల్లో రోహిత్ స్వయంగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన విషయం గమనార్హం.