Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్‌

T20 WC: Wasim Akram Hits Out Fan Over Comment On Shaheen Afridi - Sakshi

‘‘చూడండి.. ఈ అబ్బాయికి అసలు బుద్ధుందా? ఎలాంటి ప్రశ్న అడుగుతున్నావో తెలుసా? నీకంటే చిన్నవాళ్లు, పెద్ద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నీ దేశానికే చెందిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడుతావా? సిగ్గు లేదు. కాస్తైనా పశ్చాత్తాపపడు’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది గురించి ఓ నెటిజన్‌ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు ఫైర్‌ అయ్యాడు.

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా.. ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ కీలక దశలో ఉన్న సమయంలో అతడు బౌలింగ్‌ చేయలేక మైదానాన్ని వీడాడు. అయితే, అప్పటికే మ్యాచ్‌ ఇంగ్లండ్‌ చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. ఆఫ్రిది బౌలింగ్‌ కొనసాగించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా ఉండేదంటూ పాక్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓటమిని తట్టుకోలేని ఓ నెటిజన్‌.. ‘‘పిరికిపంద షాహిన్‌ ఆఫ్రిది.. మిగతా ఐదు బంతులు వేసి నీ ఓవర్‌ పూర్తి చేయాల్సింది. కానీ పిరికివాడిలా మైదానాన్ని వీడి నువ్వు పరుగులు తీశావు’’ అంటూ ఆఫ్రిదిని ట్రోల్‌ చేశాడు. ఈ క్రమంలో ఏ- స్పోర్ట్స్‌ షోలో పాల్గొన్న వసీం అక్రమ్‌ దృష్టికి ఈ ట్వీట్‌ రావడంతో సదరు నెటిజన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘‘షాహిన్‌ ఆఫ్రిది గురించి అతడేం అంటున్నాడో చూడండి. కాస్తైనా సిగ్గుండాలి. ఒకవేళ నువ్వే గనుక నా ఎదురుగా ఉండి ఉంటేనా’’ అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా నవంబరు 13న మెల్‌బోర్న్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో పాక్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. 

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లో హ్యారీ బ్రూక్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఆఫ్రిది మోకాలికి గాయమైంది. చికిత్స అనంతరం 16వ ఓవర్‌ వేసేందుకు అతడు మైదానంలోకి వచ్చాడు. అయితే ఒక బంతి వేయగానే ఆఫ్రిది బౌలింగ్‌ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. 

చదవండి: టీమిండియా కెప్టెన్సీ రేసులో ఎవరూ ఊహించని కొత్త పేరు..?
Shubman Gill: హీరోయిన్‌తో డేటింగ్‌పై స్పందించిన టీమిండియా యువ బ్యాటర్‌! ఒక్క మాటతో కన్‌ఫామ్‌ చేశాడా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top