
Courtesy: IPL Twitter
మేజర్ టోర్నీలో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు!
Ishan Kishan Reveals About Role In T20 World Cup Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు ముంబై ఇండియన్స్ క్రికెటర్ ఇషాన్ కిషన్. 32 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి సత్తా చాటాడు. తద్వారా ముంబై ఘన విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్.. ఇటీవల రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.
ఈ క్రమంలో అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తనను ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు..‘‘ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ భాయ్‌తో మాట్లాడాను. జస్‌ప్రీత్ భాయ్ కూడా నాకెంతో సాయం చేశాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కూడా.. నాకు మద్దతుగా నిలిచారు. ప్రతీ ఒక్కరు నాకు అండగా ఉన్నారు.
నువ్వింకా నేర్చుకునే దశలో ఉన్నావని, తప్పుల నుంచి పాఠాలు చేర్చుకుని.. వరల్డ్‌కప్ టోర్నీలో వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ వెన్నుతట్టారు. వారి సలహాలు, సూచనలు పాటించాను. సమయం వచ్చినపుడు నన్ను నేను నిరూపించుకోగలిగాను. ‘‘జట్టులో ఓపెనర్‌గా నువ్వు సెలక్ట్ అయ్యావు. మేజర్ టోర్నీలో ఓపెనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండు’’ అని విరాట్ భాయ్ చెప్పాడు. నాకెంతో ఆనందంగా అనిపించింది. నిజానికి ఓపెనింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2021: టీ20 వరల్డ్‌కప్ బాగా ఆడు.. కానీ గెలవకూడదు.. ఓకేనా!
Courtesy: IPL Twitter
ఇక ముంబై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టినప్పటికీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచామని ఇషాన్ కిషన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘నాతో పాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా రాణించడం సంతోషకరం. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఫామ్‌లోకి రావడం గొప్ప విషయం. పూర్తి సానుకూల దృక్పథంతో ఆడాము. 250-260 పరుగులు చేయాలని భావించాం. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఎప్పుడు పరిస్థితులు, ఎలా మారతాయో తెలియదు. ఏదేమైనా మన అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కనబరచడమే ముఖ్యం’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్(84), సూర్యకుమార్ యాదవ్(82) ఈ మ్యాచ్‌తో అద్బుతమైన ఫామ్‌లోకి రావడం ఐసీసీ ఈవెంట్‌లో టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించిందని చెప్పవచ్చు.