Australia: డిఫెండింగ్‌ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్‌ ఓడితేనే

T20 WC: AUS-Have Semis Chances Only-If-ENG Lost Match To Sri Lanka - Sakshi

టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కు సమీకరణాలు మారిపోతున్నాయి. గ్రూప్‌-1లో న్యూజిలాండ్‌ ఐర్లాండ్‌పై గెలిచి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. కివీస్‌ మినహా రెండు గ్రూప్‌ల్లోనూ ఏ జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా శుక్రవారం సూపర్‌-12 గ్రూప్‌-1లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీస్‌ ఆశలు నిలుపుకున్నప్పటికి మెరుగైన రన్‌రేట్‌ సాధించలేకపోయింది.

రన్‌రేట్‌ విషయం పక్కనబెడితే ఆసీస్‌ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లింది. గతేడాది అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగురేసుకుపోయిన ఆస్ట్రేలియా ఈసారి సొంతగడ్డపై ఆకట్టుకునే ప్రదర్శన చేయడం లేదు. అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించినప్పటికి  ఆసీస్‌ సెమీస్‌ చేరడం కష్టమే.  డిఫెండింగ్‌ చాంపియన్‌ భవితవ్యం మొత్తం ఇంగ్లండ్‌ , శ్రీలంక మ్యాచ్‌పైనే ఆధారపడి ఉంది. ఇంగ్లండ్‌ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా పని గోవిందా. 

దీనికి ప్రధాన కారణం ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేట్‌ మైనస్‌లో ఉండడమే. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 168 పరుగులు చేసింది. +1.187 రన్‌రేట్‌ ఉండాలంటే ఆస్ట్రేలియా ఆఫ్గన్‌ను భారీ తేడాతో ఓడించాలి. కానీ ఆ అవకాశం ఆఫ్గన్‌ ఇవ్వలేదు సరికదా.. దాదాపు ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించి ఓడించినంత పని చేసింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా రన్‌రేట్‌లో పెద్దగా మార్పు జరగలేదు. దీంతో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దుతో ఏడు పాయింట్లతో ఉన్నప్పటికి నెట్‌రన్‌రేట్‌(-0.173) ఇంకా మైనస్‌లోనే ఉంది. 

ఇక శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌ రన్‌రేట్‌ ప్లస్‌లో ఉంది.+0.547 రన్‌రేట్‌తో ఉన్న ఇంగ్లండ్‌ శ్రీలంకపై మాములు విజయం సాధించినా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ను శ్రీలంక చిత్తు చేస్తే మాత్రం​అప్పుడు పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం శ్రీలంకకు పెద్ద సవాల్‌. అయితే టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆస్ట్రేలియా భవితవ్యం రేపటి మ్యాచ్‌(ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక, నవంబర్‌ 5న)తో తేలిపోనుంది.

చదవండి: రషీద్‌ ఖాన్‌ సంచలన ఇన్నింగ్స్‌.. ఆసీస్‌కు ముచ్చెమటలు

AFG VS AUS: ఒకసారి బౌలర్‌ ఆగాడు.. రెండోసారి బ్యాటర్‌ ఆపాడు; మూడోసారికి రివేంజ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top