WC 2023: కన్నీటి పర్యంతమైన హర్మన్‌... అక్కున చేర్చుకున్న అంజుమ్‌.. వీడియో వైరల్‌

T20 WC 2023: Harmanpreet Burst Into Tears Anjum Consoled Her Viral - Sakshi

ICC Womens T20 World Cup 2023: ఇటీవలే సౌతాఫ్రికాలో అండర్‌-19 టీ20 వరల్డ్‌కప్‌-2023లో మన అమ్మాయిలు అదరగొట్టి ఐసీసీ టైటిల్‌ గెలిచారు. అదే జోష్‌ను కొనసాగిస్తూ అదే గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని హర్మన్‌ప్రీత్‌ సేన భావించింది. అందుకు తగ్గట్లుగానే మెరుగైన ప్రదర్శనతో టీ20 మహిళా ప్రపంచకప్‌-2023 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది.

అయితే, కీలక మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అనారోగ్యం బారిన పడిందన్న వార్త అభిమానులను కలవరపెట్టింది. అయినప్పటికీ, పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కొనే క్రమంలో బరిలోకి దిగిన హర్మన్‌ అద్భుత ఇన్నింగ్స్‌(34 బంతుల్లో 52 పరుగులు) ఆడింది.

173 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా జెమీమా రోడ్రిగ్స్‌ 24 బంతుల్లో 43 పరుగులతో చెలరేగగా.. హర్మన్‌ అర్ధ శతకంతో మెరిసింది. అయితే, ఆమె రనౌట్‌ కావడం టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. ఆఖరి వరకు పోరాడినా గెలుపు గీత దాటలేక ఓటమి ముందు తలవంచింది.

మరోసారి ప్రపంచకప్‌ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌ ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కన్నీటిపర్యంతమైంది. అద్భుత పోరాట పటిమ కనబరిచినా.. పరాజయం తప్పకపోవడంతో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర భావోద్వేగానికి లోనైంది.

ఈ క్రమంలో అక్కడే ఉన్న భారత మాజీ సారథి అంజుమ్‌ చోప్రా హర్మన్‌ను అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని హర్మన్‌కు ఓదార్పు మాటలు చెప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌ సమయంలో సన్‌గ్లాసెస్‌ ధరించిన హర్మన్‌ తన కన్నీటిని మాతృదేశం చూడకూడదనే ఉద్దేశంతోనే వాటిని ధరించినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్‌ ఎలా ఉందంటే!
PSL 2023: బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్‌ కెప్టెన్‌! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top