T20 WC 2022: 4 సెమీస్‌ బెర్తులు.. 9 జట్ల మధ్య పోటీ! ఆరోజే అసలు మ్యాచ్‌లు..

T20 WC 2022: Group 1 Group 2 Teams Semis Chances After SA Pak Match - Sakshi

ICC Mens T20 World Cup 2022- Semi Final Scenario: టీ20 ప్రపంచకప్‌-2022లో సూపర్‌–12 ఆఖరి మజిలీ రసవత్తరం అవుతోంది. గ్రూప్‌–2లో దక్షిణాఫ్రికా ఓటమి పాకిస్తాన్‌కే కాదు... బంగ్లాదేశ్‌కూ ఊపిరిలూదింది. దీంతో గ్రూప్‌–1లాగే ‘2’లో కూడా ప్రధాన జట్లన్నీ సెమీఫైనల్‌ రేసులో ఉన్నాయి. మొత్తం మీద నాలుగు సెమీస్‌ బెర్తుల కోసం తొమ్మిది జట్లు పోటీలో ఉండటం విశేషం.

ఆదివారం అసలు మ్యాచ్‌లు!
గ్రూప్‌–1లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్‌... గ్రూప్‌–2లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు సై అంటే సై అంటున్నాయి. గ్రూప్‌–2 నుంచి సెమీఫైనల్‌ చేరే రెండు జట్లేవో ఆదివారం ఒకే రోజున జరిగే మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే (దక్షిణాఫ్రికా–నెదర్లాండ్స్‌; పాకిస్తాన్‌–బంగ్లాదేశ్‌; భారత్‌–జింబాబ్వే) తేలనుంది.

ఒకవేళ సౌతాఫ్రికా గనుక ఓడితే
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే మాత్రం ఆ జట్టు నిష్క్రమిస్తుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీలో సఫారీలను దురదృష్టం వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలుత జింబాబ్వేతో మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉన్నా మ్యాచ్‌ వర్షార్పణమైంది.

ఆ తర్వాత బంగ్లాదేశ్‌, టీమిండియాలపై విజయం సాధించినా.. పాక్‌తో మ్యాచ్‌లో పరాభవం తప్పలేదు. కాగా మెగా టోర్నీల్లో ఆఖరి వరకు పోరాడి అసలు సమయం వచ్చే సరికి చేతులెత్తే జట్టు(చోకర్స్‌)గా ప్రొటిస్‌కు అపవాదు ఉంది. ఇక బ్యాటర్‌గా కెప్టెన్‌ తెంబా బవుమా వైఫల్యం, కీలక ఆటగాడు  కిల్లర్‌ మిల్లర్‌ గాయం బారిన పడటం సఫారీలను కలవరపెడుతున్నాయి. మరి డచ్‌ జట్టుతో మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి!

పాక్‌ గెలుపొందినా
మరోవైపు.. పాకిస్తాన్‌ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పటిష్టమైన టీమిండియాతో పోరును ఆఖరి బంతి వరకు తీసుకువచ్చిన బంగ్లాదేశ్‌పై పాక్‌కు గెలుపు అంతతేలికేమీ కాదు. ఒకవేళ ఆ జట్టుపై పాకిస్తాన్‌  నెగ్గినా.. బాబర్‌ ఆజం బృందం సెమీఫైనల్‌ బెర్త్‌ మాత్రం భారత్‌–జింబాబ్వే మ్యాచ్‌ ముగిశాకే ఖరారవుతుంది.

చేజేతులా పాక్‌.. ఒక్క విజయంతో..
భారత్‌తో గొప్పగా పోరాడి ఓడిన జట్టు పాకిస్తాన్‌. జింబాబ్వే చేతిలో చెత్తగా ఓడిన జట్టు పాకిస్తాన్‌. ముందుకెళ్లే అవకాశాల్ని అత్యంత క్లిష్టం చేసుకున్న జట్టు పాకిస్తానే! ఇంతటి ఒత్తిడిలో కూరుకుపోయిన ఆ జట్టు పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఏం గెలుస్తుందనే విమర్శలు ఇంటాబయట ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ‘ఆల్‌రౌండ్‌ షో’తో సఫారీని కంగుతినిపించిన పాక్‌... ఒక్క విజయంతో రేసులోకి దూసుకొచ్చింది.

గ్రూప్‌–2 సెమీస్‌ ముఖచిత్రాన్నీ మార్చింది. టి20 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన గ్రూప్‌–2 ‘సూపర్‌–12’ మ్యాచ్‌లో పాక్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 33 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. మొదట పాక్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్‌ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. నోర్జే 4 వికెట్లు తీశాడు.

తర్వాత వర్షం వల్ల దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా సవరించారు. కానీ దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 108 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్, ఓపెనర్‌ బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. షాహిన్‌ అఫ్రిది (3/14) పేస్‌తో, షాదాబ్‌ ఖాన్‌ (2/16) స్పిన్‌తో జట్టును గెలిపించి రేసులో నిలబెట్టారు. ఆరంభంలో తడబడి... పాక్‌ బ్యాటింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ (4) అవుటయ్యాడు.

పవర్‌ ప్లేలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (6)తో పాటు జోరుమీదున్న హారిస్‌ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్లను కోల్పోయింది. మరో 3 బంతుల వ్యవధిలో షాన్‌ మసూద్‌ (2) ఆట ముగిసింది. 43/4... ఇదీ పాక్‌ స్కోరు. ఇలాంటి దశలో 150 స్కోరే గగనం. కానీ ఇఫ్తికార్‌ అహ్మద్, నవాజ్‌ (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పట్టుదల పాక్‌ దిశను మార్చితే... షాదాబ్‌ సిక్సర్ల ఉప్పెన దక్షిణాఫ్రికా పాలిట భారీలక్ష్యాన్ని నిర్దేశించేలా చేసింది.

ఇఫ్తికార్, షాదాబ్‌ ఆరో వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 82 పరుగులు జోడించం విశేషం. ఆఖరి 8 బంతుల్లో పాక్‌ 4 వికెట్లను కోల్పోయింది. లేదంటే 200 స్కోరు నమోదయ్యేది. సఫారీకి ఆది నుంచే... పెద్ద లక్ష్యం ఎదురైన సఫారీ జట్టు 16 పరుగులకే కీలకమైన డికాక్‌ (0), రోసో (7) వికెట్లను కోల్పోయింది. బవుమా, మార్క్‌రమ్‌ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో కోలుకున్నట్లే కనిపించిన సఫారీని స్పిన్‌తో షాదాబ్‌ చావుదెబ్బ తీశాడు.

ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్‌ చేయడంతో 66 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వర్షం పడటంతో లక్ష్యాన్ని మార్చగా, బ్యాటింగ్‌ కొనసాగించిన సఫారీ పాకిస్తాన్‌ బౌలర్ల పట్టుదలకు తలవంచింది. నసీమ్‌ షా (1/19), హారిస్‌ రవూఫ్‌ (1/44), మొహమ్మద్‌ వసీమ్‌ (1/13) తలా ఒక దెబ్బ కొట్టడంతో చిత్రంగా 9 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయింది. 94/4 నుంచి 103/9 స్కోరుకు పడిపోయి ఓటమిని ఆహ్వానించింది. 

చదవండి: SMAT 2022: శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు ఇన్నింగ్స్‌! ఫైనల్లో ముంబై
T20 WC 2022: జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top