T20 WC 2022: అసలు తమ అత్యుత్తమ తుది జట్టు ఏదో భారత్‌కు తెలుసా? హుడా విధ్వంసకర బ్యాటర్‌.. అయినా..

T20 WC 2022: Ashley Giles Asks Do India Really Know What Their Best Team - Sakshi

India Vs England 3rd T20: మరో మూడు నెలల్లో టీ20 ప్రపంచకప్‌-2022 ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కూర్పుపై ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆష్లే గిల్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు తమ అత్యుత్తమ తుది జట్టు ఏదో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తెలుసా లేదా అని ప్రశ్నించాడు. తరచుగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయడం తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు.

కాగా ఇటీవలి కాలంలో భారత జట్టు కూర్పులో తరచుగా మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన ఆటగాళ్లను తదుపరి మ్యాచ్‌లలో పక్కనపెట్టేశారు. దీపక్‌ హుడా స్థానంలో విరాట్‌ కోహ్లి జట్టులోకి వచ్చాడు.

నాలుగు మార్పులతో..
ఇక రెండో మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ కైవసమైన తరుణంలో మూడో మ్యాచ్‌కు ముందు ప్రయోగాలు చేశారు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌, యజువేంద్ర చహల్, జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్‌, అవేశ్ ఖాన్‌, రవి బిష్ణోయ్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. 

అదే విధంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ మార్పులు చేశారు. పంత్‌ను మరోసారి ఓపెనర్‌గా పంపారు. దినేశ్‌ కార్తిక్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దించారు. ఈ నేపథ్యంలో ఆష్లే ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అసలు టీమిండియాకు ఆ విషయం తెలుసా?
ఈ మేరకు.. ‘‘నిజంగా ఇండియాకు ప్రస్తుతం తమ అత్యుత్తమ తుదిజట్టు ఏదో తెలుసా? డీకే బాగా ఆడగలడు. అయితే, తన కంటే మెరుగ్గా ఆడగల చాలా మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. ఇక దీపక్‌ హుడా టాపార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్‌. రిషభ్‌ పంత్‌ డౌన్‌ ఆర్డర్‌లో మెరుగ్గా రాణించగలడు.

కానీ పంత్‌ను ఓసారి టాప్‌, ఓసారి మిడిలార్డర్‌లో ఆడిస్తున్నారు. అదే విధంగా డీకే స్థానం విషయంలోనూ స్పష్టత లేదు. ఒకవేళ కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వస్తే.. ఈ స్థానాల్లో మరోసారి మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. కాబట్టి పంత్‌ను మిడిలార్డర్‌లో ఫిట్‌ చేసి.. వరల్డ్‌కప్‌ టోర్నీకి సన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. 

తరచుగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల చేయడం సరికాదు’’ అని ఆష్లే అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ తప్ప మరెవరూ రాణించకపోవడంతో 17 పరుగుల తేడాతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే, 2-1 తేడాతో సిరీస్‌ను మాత్రం టీమిండియా దక్కించుకుంది.

చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్‌! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో!
T20 World Cup 2022: ఈసారి టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత ఈజీ కాదు: అక్తర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top