నేను చూసిన మేటి ఇన్సింగ్స్‌లలో ఇదొకటి: అశ్విన్‌

Sydney Test Draw Ashwin Says Vihari 23 On 5th Day As Hundred - Sakshi

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారి, మ్యాచ్‌ను వారికి దక్కకుండా చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారిని సహచర ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. మ్యాచ్‌ను డ్రాగా ముగించే క్రమంలో విహారి సాధించిన అజేయమైన 23 పరుగులు శతకంతో సమానమని, తాను చూసిన మేటి ఇన్నింగ్స్‌ల్లో ఇది కూడా ఒకటి అని అశ్విన్‌ పేర్కొన్నాడు. గాయంతో బాధపడుతూనే ఆటను కొనసాగించిన విహారి.. 161 బంతులను ఎదుర్కొని మ్యాచ్‌ను చేజారకుండా వీరోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడని ప్రశంసించాడు. అతని ప్రదర్శన యావత్‌ భారతావనిని గర్వపడేలా చేసిందని కొనియాడాడు.

విహరి ఇన్నింగ్స్‌ టీమిండియా మాజీ ఆటగాడు 'ది వాల్‌' రాహుల్‌ ద్రవిడ్‌ ప్రదర్శనను గుర్తుచేసిందని పేర్కొన్నాడు. అతను ప్రదర్శించిన పోరాట పటిమ సహచర సభ్యుల్లో ఎంతో స్పూర్తిని నింపిందని, ఆఖరి టెస్టులో విజయం సాధించడానికి ఇది తమకు తోడ్పడుతుందని అశ్విన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. ఆరంభంలోనే రహానే (18 బంతుల్లో 4 పరుగులు) వికెట్‌ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా, రిషబ్‌ పంత్‌ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు సాధించి భారత్‌ శిబిరంలో విజయంపై ఆశలు రేకెత్తించాడు.

ఇక పుజారా 205 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 77 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో తన వంతు సహకారాన్ని అందించాడు. విహారికి జతగా అశ్విన్‌ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు సాధించి సమయోచితమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. వీరిద్దరూ కలిసి 257 బంతులను ఎదుర్కొని ఆసీస్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. తొలి ఇన్సింగ్స్‌లో 338 పరుగులు చేసి భారత్‌ను 238 పరుగులకు కట్టడి చేసిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్సింగ్స్‌లో మరింత మెరుగ్గా ఆడిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించడంతో రెండో ఇన్సింగ్స్‌ను 312 పరుగుల వద్ద ఆసీస్‌ డిక్లేర్‌ చేసింది. 407 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top