Suryakumar Yadav: నాడు కవ్వించిన కోహ్లి, బ్యాట్‌తో జవాబిచ్చి.. టాప్‌-5 ఇన్నింగ్స్‌!

Suryakumar Yadav Birthday: Top 5 Performances Of MI SKY Check - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విజయవంతమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ప్రారంభం కానున్న ఐపీఎల్‌-2021 రెండో దశకు సిద్ధమవుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌... ఇటీవలి శ్రీలంక పర్యటనతో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా ఇంగ్లండ్‌ తాజా పర్యటనలో భాగంగా టెస్టుల్లోనూ అడుగుపెట్టే అవకాశం వచ్చినట్టే వచ్చి కోవిడ్‌ ఎఫెక్ట్‌(శ్రీలంక టూర్‌లో) వల్ల మిస్సయింది. అయితేనేం ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ తన ముద్ర వేశాడు సూర్యకుమార్‌. మంగళవారం అతడి పుట్టిన రోజు సందర్భంగా టాప్‌- 5 ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.

ఆర్సీబీతో మ్యాచ్‌.. 79 నాటౌట్‌.. అపుడే కోహ్లితో
ఐపీఎల్‌-2020లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన 48వ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. 43 బంతుల్లోనే 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 బౌండరీలు, మూడు సిక్సర్లతో సత్తా చాటాడు. తద్వారా ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో కోహ్లి సేనపై గెలుపొందడంలో సూర్యకుమార్‌ కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా... ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ మధ్య చోటుచేసుకున్న ఘటన అప్పట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 13ఓవర్‌లో కోహ్లి బంతిని చేతితో షైన్‌ చేస్తూ సూర్యకుమార్‌ యాదవ్‌ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగినప్పటికీ.. అతడు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా, తనను తీక్షణంగా చూస్తున్న కోహ్లికి కళ్లతోనే బదులిచ్చాడు. ఈ విషయం గురించి తర్వాత సూర్య మాట్లాడుతూ.. మైదానంలో మాత్రమే కోహ్లి దూకుడుగా ఉంటాడని, ఆ తర్వాత తనకు శుభాకాంక్షలు కూడా తెలిపాడని అతడు చెప్పాడు.

ఇంగ్లండ్‌పై హాఫ్‌ సెంచరీ
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌(నాలుగవది)తో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా మొదలుపెట్టిన ఈ ముంబైకర్‌.. 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 57 పరుగులతో రాణించి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో
ఐపీఎల్‌-2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.36 బంతుల్లో 56 పరుగులు చేసిన అతడు.. కేకేఆర్‌కు 152 పరుగుల లక్ష్యం విధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ 10 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో
ముంబై తరపున మైదానంలో దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ- 2019లో అద్భుతంగా రాణించాడు. 38 బంతుల్లో 81 పరుగులు చేసి హర్యానాపై తమ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. తనదైన శైలిలో చెలరేగి ఆడి 26 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం సాధించేలా చేశాడు.

శ్రీలంక టూర్‌లో
ఈ ఏడాది శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో సూర్యకుమార్‌ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌ ద్వారా వన్డేల్లో అడుగుపెట్టిన అతడు.. రెండో వన్డేలో 44 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

-మరి అద్భుతమైన ఆటతో తనను తాను నిరూపించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు మేజర్‌ టోర్నీల్లో ఆడే అవకాశం రావడం సహజమే కదా. అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడే జట్టులో అతడికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. 
-వెబ్‌డెస్క్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top