హై హై హైదరాబాద్‌...

Sunrisers Hyderabad beat Kings XI Punjab by 69 runs - Sakshi

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 69 పరుగులతో సన్‌రైజర్స్‌ ఘనవిజయం

చెలరేగిన బెయిర్‌స్టో, వార్నర్‌

పూరన్‌ పోరాటం వృథా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్‌లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది.  ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్‌తో కుప్పకూలిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ లీగ్‌లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.   

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగియడం పంజాబ్‌ వైఫల్యాన్ని సూచిస్తోంది.  

శతక భాగస్వామ్యం...
సీజన్‌లో తొలిసారి ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాట్రెల్‌ వేసిన మొదటి ఓవర్‌లోనే 13 పరుగులు రాబట్టడంతో వీరి జోరు మొదలైంది. పవర్‌ప్లేలో హైదరాబాద్‌ స్కోరు 58 పరుగులకు చేరింది. రవి బిష్ణోయ్‌ ఓవర్లో వరుసగా 6, 4, 6 బాది బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. అంతకుముందు 19 పరుగుల వద్ద మిడాఫ్‌లో రాహుల్‌ కష్టసాధ్యమైన క్యాచ్‌ వదిలేయడం కూడా బెయిర్‌స్టోకి కలిసొచ్చింది. హైదరాబాద్‌ 10 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో సరిగ్గా 100 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన బెయిర్‌స్టో... ముజీబ్‌ ఓవర్లో వరుసగా మరో రెండు సిక్సర్లు సాధించడం విశేషం. మరోవైపు 37 బంతుల్లో వార్నర్‌ అర్ధసెంచరీ పూర్తయింది.  

5 ఓవర్లలో 6 వికెట్లు...
15 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ స్కోరు వికెట్‌ కోల్పోకుండా 160 పరుగులు. కానీ జట్టు బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. పంజాబ్‌ చక్కటి బౌలింగ్‌కు తర్వాతి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే వచ్చాయి. బిష్ణోయ్‌ ఓవర్లో వరుస బంతుల్లో వార్నర్, బెయిర్‌స్టో అవుట్‌ కాగా, భారీ షాట్లు ఆడే క్రమంలో పాండే (1), సమద్‌ (8) వెనుదిరిగారు. అయితే చివరి రెండు ఓవర్లలో విలియమ్సన్‌ (20 నాటౌట్‌) చకచకా రన్స్‌ చేయడంతో స్కోరు 200 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ 41 పరుగులు చేసింది.   202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్‌ ఏ దశలోనూ లక్ష్యం చేరేలా కనిపించలేదు. కొద్దిసేపు పూరన్‌ జోరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు.
              
పూరన్‌ మెరుపులు..
పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం పూరన్‌ బ్యాటింగ్‌ ఒక్కటే. తొలి బంతినే కవర్‌డ్రైవ్‌ బౌండరీగా మలచి ఖాతా తెరిచిన అతను, అభిషేక్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని పెంచాడు. సమద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లోనైతే పూరన్‌ భీకరంగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌ తొలి ఐదు బంతుల్లో 6, 4, 6, 6, 6 బాది 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రివ్యూ నిర్ణయంపై రివ్యూ...
పంజాబ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఖలీల్‌ వేసిన ఐదో బంతి ముజీబ్‌ బ్యాట్‌కు తాకుతూ కీపర్‌ చేతుల్లో పడటంతో అప్పీల్‌ చేయగా, అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆపై రైజర్స్‌ రివ్యూ కూడా కోరలేదు. అయితే ఇద్దరూ అంపైర్లు చర్చించి మూడో అంపైర్‌ను సంప్రదించారు. బంతిని నేలను తాకిందా లేదా అనేదానిని మాత్రమే సమీక్షించిన థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో ముజీబ్‌ మైదానం వీడబోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి అవుట్‌పై సందేహం వ్యక్తం చేస్తూ రివ్యూ కోరాడు. దాంతో అల్ట్రా ఎడ్జ్‌ రీప్లే చూసిన అనంతరం బంతి బ్యాట్‌కు తగిలిందంటూ మూడో అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. ప్రధాన బ్యాట్స్‌మన్‌ కాకపోయినా రివ్యూపై మళ్లీ రివ్యూ కోరడంతో మైదానంలో కొద్దిసేపు డ్రామా కనిపించింది.  

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 52; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బిష్ణోయ్‌ 97; సమద్‌ (సి) అర్‌‡్షదీప్‌ (బి) బిష్ణోయ్‌ 8; పాండే (సి అండ్‌ బి) అర్‌‡్షదీప్‌ 1; విలియమ్సన్‌ (నాటౌట్‌) 20; ప్రియమ్‌ గార్గ్‌ (సి) పూరన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 0; అభిషేక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) షమీ 12; రషీద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. 

వికెట్ల పతనం: 1–160; 2–160; 3–161; 4–173; 5–175; 6–199. 

బౌలింగ్‌: కాట్రెల్‌ 3–0–33–0; ముజీబ్‌ 4–0–39–0; షమీ 4–0–40–1; మ్యాక్స్‌వెల్‌ 2–0–26–0; బిష్ణోయ్‌ 3–0–29–3; అర్‌‡్షదీప్‌ 3–0–33–2.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) విలియమ్సన్‌ (బి) అభిషేక్‌ 11; మయాంక్‌ (రనౌట్‌) 9; సిమ్రన్‌ సింగ్‌ (సి) గార్గ్‌ (బి) ఖలీల్‌ 11; పూరన్‌ (సి) నటరాజన్‌ (బి) రషీద్‌ 77; మ్యాక్స్‌వెల్‌ (రనౌట్‌) 7; మన్‌దీప్‌ (బి) రషీద్‌ 6; ముజీబ్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్‌ 1; రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 6; షమీ (ఎల్బీ)(బి) రషీద్‌ 0; కాట్రెల్‌ (బి) నటరాజన్‌ 0; అర్‌‡్షదీప్‌ (సి)వార్నర్‌ (బి)నటరాజన్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో ఆలౌట్‌) 132.

వికెట్ల పతనం: 1–11; 2–31; 3–58; 4–105; 5–115; 6–126; 7–126; 8–126; 9–132; 10–132.

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–27–0; ఖలీల్‌ అహ్మద్‌ 3–0–24–2; నటరాజన్‌ 3.5–0–24–2; అభిషేక్‌ 1–0–15–1; రషీద్‌ ఖాన్‌ 4–1–12–3; సమద్‌ 1–0–28–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top