Nikhat Zareen: నిఖత్‌ తడాఖా

Star India boxers Nikhat Zareen and Lovlina Borgohain rewrote the record books on Sunday - Sakshi

రెండోసారి విశ్వవిజేతగా భారత స్టార్‌ బాక్సర్‌

ఫైనల్లో ఆసియా చాంపియన్‌పై విజయం

రూ. 82 లక్షల 34 వేలు ప్రైజ్‌మనీ సొంతం

లవ్లీనా ఖాతాలోనూ స్వర్ణం 

సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు) ‘గోల్డెన్‌’ ఫినిషింగ్‌ ఇచ్చారు.   

న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్‌ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది.

ఫైనల్లో నిఖత్‌ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది.

దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది.  2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. 

దూకుడుగా... 
థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్‌ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్‌లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్‌ విధించారు. ఆ తర్వాత నిఖత్‌ ఎదురుదాడికి దిగి రెండు రైట్‌ హుక్‌ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్‌ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్‌లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది.

రెండో రౌండ్‌లో థి టామ్‌ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్‌లో నిఖత్‌ మళ్లీ జోరు పెంచింది. నిఖత్‌ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్‌ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్‌ బాక్సర్‌’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్‌ బాక్సర్‌’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్‌’ వాహనం 
లభించింది.  

ఓవరాల్‌ చాంపియన్‌ భారత్‌ 
ఆతిథ్య భారత్‌ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్‌ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు.

రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్‌ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్‌లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. 

లవ్లీనా తొలిసారి... 
అస్సాం బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్‌ పార్కర్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top