
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను శ్రీలంక అద్బుతమైన విజయంతో ఆరంభించింది. పల్లెకలె వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను శ్రీలంక చిత్తు చేసింది. 155 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది.
శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ పాథుమ్ నిస్సాంక(16 బంతుల్లో5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42) మెరుపులు మెరిపించాడు.
బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో పర్వేజ్ హుస్సేన్ ఎమోన్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నయీమ్(32), మిరాజ్(29) రాణించారు.
లంక బౌలర్లలో మహేష్ థీక్షణ రెండు, వాండర్సే, షనక, తుషారా తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జూలై 13న దంబుల్లా వేదికగా జరగనుంది. ఇప్పటికే వన్డే, టెస్టు సిరీస్‌లను శ్రీలంక సొంతం చేసుకుంది.
చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో