
ప్రణయ్ అవుట్
మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: తొలి రౌండ్లో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై రాణించిన భారత షట్లర్లకు ప్రిక్వార్టర్స్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా, హెచ్.ఎస్.ప్రణయ్, ఆయుశ్ శెట్టి, సతీశ్ కుమార్ కరుణాకరన్‌లకు పరాజయం ఎదురైంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్స్ చేరగా... మహిళల డబుల్స్‌లో ప్రేరణ అల్వేకర్–మృణ్మయి దేశ్‌పాండేలకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రేరణ–మృణ్మయి జంట 9–21, 14–21తో సూ యిన్ హుయ్–లిన్ జి యున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా–ధ్రువ్ కపిల జోడీ 21–17, 18–21, 21–15తో ఫ్రాన్స్‌కు చెందినలీ పాలెర్మో–జులియెన్ మైమో జంటపై గెలిచింది.
శ్రీకాంత్ వరుస గేముల్లో...
పురుషుల సింగిల్స్‌లో ఒక్క శ్రీకాంత్ మాత్రమే ముందంజ వేశాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంక్ ప్లేయర్ శ్రీకాంత్ 23–21, 21–17తో తనకన్నా మెరుగైన 33వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. ఈ రెండు గేములు గెలిచేందుకు శ్రీకాంత్ 59 నిమిషాలు పాటు చెమటోడ్చాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ ఫ్రాన్స్‌కు చెందిన తొమా పొపొవ్‌తో తలపడతాడు.
మిగతా పురుషుల సింగిల్ పోటీల్లో సతీశ్ కరుణాకరన్ 14–21, 16–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆశించిన స్థాయి ఆటతీరు కనబరచలేకపోయిన ప్రణయ్ 9–21, 18–21తో వరుస గేముల్లో యుషి తనక (జపాన్) చేతిలో కంగుతినగా... ఆయుశ్ శెట్టి 13–21, 17–21తో తొమ పొపొవ్ ధాటికి నిలువలేకపోయాడు.