NZ Vs SL: సిరీస్‌ ఓటమి.. వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించని లంక; ఇక క్వాలిఫయర్స్‌లోనే

Sri Lanka Loss ODI Series-To NZ-Qualification-For-CWC23 More-Tough - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక ఓటమి పాలయ్యింది. హామిల్టన్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలో న్యూజిలాండ్‌ గెలవగా.. రెండో వన్డే వర్షార్పణం అయింది. ఇక కీలకమైన మూడో వన్డేలో ఓడిన లంక సిరీస్‌ కోల్పోవడంతో పాటు ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

ఈ ఓటమితో లంక నేరుగా వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం చేజార్చుకుంది. ఇక జూన్‌లో జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో లంక పాల్గొంటుంది. అక్కడ గెలిచే మ్యాచ్‌ల ఫలితాలను బట్టి వరల్డ్‌కప్‌ అర్హతకు అవకాశం ఉంటుంది. పొరపాటున క్వాలిఫయర్స్‌లో గనుక ఓడిపోతే లంక వన్డే వరల్డ్‌కప్‌ కథ ముగిసినట్లే. ఇక వన్డే వరల్డ్‌కప్‌ ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ సహా న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

ఇక శ్రీలంక రేసు నుంచి అవుట్‌ అయింది. దీంతో జూన్‌లో వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో టాప్‌-3లో నిలిచిన జట్లు వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌-నవంబర్‌లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ జరగనుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక కివీస్‌ బౌలర్ల ధాటికి 41.3 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. పాతుమ్‌ నిస్సాంక(64 బంతుల్లో 57 పరుగులు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. చివర్లో కెప్టెన్‌ షనక(31 పరుగులు), కరుణరత్నే(24 పరుగులు) చేయడంతో లంక కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో డారిల్‌ మిచెల్‌, షిప్లే, మాట్‌ హెన్రీలు తలా ‍మూడు వికెట్లు పడగొట్టారు. 

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ఆడుతూ పాడుతూ చేధించింది. 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. విల్‌ యంగ్‌(113 బంతుల్లో 86 నాటౌట్‌, 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్‌(52 బంతుల్లో 44 నాటౌట్‌, 5 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా రెండు వికెట్లు తీయగా.. దాసున్‌ షనక, కాసున్‌ రజితలు చెరో వికెట్‌ తీశారు.

ఈ విజయంతో న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 2-0తో గెలుచుకుంది. విల్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు గెలుచుకోగా.. హెన్రీ షిప్లేను ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వరించింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఏప్రిల్‌ 2 నుంచి 8 వరకు జరగనుంది. తొలి టి20 మ్యాచ్‌ను కివీస్‌, లంకలు ఏప్రిల్‌ 2న ఆక్లాండ్‌ వేదికగా ఆడనున్నాయి.

చదవండి: IPL 2023 GT Vs CSK: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. మ్యాచ్‌ జరుగుతుందా?

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top