Sreesanth Retirement: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా వివాదాస్పద బౌలర్‌

Sreesanth Announces Retirement From All forms Of First Class Cricket - Sakshi

Sreesanth Announces Retirement: టీమిండియా వివాదాస్పద బౌలర్‌, కేరళ క్రికెటర్‌ శాంతకుమరన్‌ నాయర్‌ శ్రీశాంత్‌ (39) క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని, ఆ స్థాయికి చేరేందుకు సహకరించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని చాలా బాధతో, బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నానని తెలిపాడు. యువతరానికి అవకాశం ఇచ్చేందుకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించాడు. 

క్రికెట్‌ నుంచి తప్పుకోవాల్సిన సరైన సమయమిదేనని అభిప్రాయపడ్డాడు. బాగా ఆలోచించే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇది తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చాడు. టీమిండియా తరఫున 27 టెస్ట్‌లు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడిన శ్రీశాంత్‌ మొత్తం 169 వికెట్లు(87 టెస్ట్‌ వికెట్లు, 75 వన్డే, 7 టీ20 వికెట్లు) పడగొట్టాడు.  ఈ వెటరన్‌ పేసర్‌ ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి కనబర్చకపోవడంతో అమ్ముడుపోని క్రికెటర్ల జాబితాలో మిగిలిపోయాడు. శ్రీశాంత్‌ 50 లక్షల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో మెగా వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు.
చదవండి: చెన్నై సూపర్‌ కింగ్స్‌లోకి శ్రీశాంత్‌...!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top