వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన.. ఇంతలోనే షాకింగ్‌ న్యూస్‌

South Africa Star Set To Retire From ODIs After 2023 World Cup - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ కోసం జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే క్రికెట్‌ సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ సౌతాఫ్రికా (CSA).. జట్టు ప్రకటన సందర్భంగా ధృవీకరించింది. 2013 వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డికాక్‌.. సౌతాఫ్రికా తరఫున 140 మ్యాచ్‌లు ఆడి 44.85 సగటున 96.08 స్ట్రయిక్‌రేట్‌తో 5966 పరుగులు చేశాడు.

ఇందులో 17 సెంచరీలు, 29 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2016లో సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాపై చేసిన 178 పరుగులు అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. వికెట్‌కీపర్‌గా డికాక్‌ 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్‌లు చేశాడు. 30 ఏళ్ల డికాక్‌ 8 వన్డేల్లో సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇందులో 3 పరాజయాలు, 4 విజయాలు సాధించాడు. డికాక్‌.. సౌతాఫ్రికా తరఫున గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 30 సగటున 450 పరుగులు సాధించాడు.

డికాక్‌ వన్డే రిటైర్మెంట్‌ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్‌ డైరెక్టర్‌ ఈనాక్‌ ఎన్క్వే స్పందిస్తూ.. సౌతాఫ్రికా టీమ్‌ను డికాక్‌ ఎనలేని సేవలు చేశాడని కొనియాడాడు. డికాక్‌ తన అటాకింగ్‌ బ్యాటింగ్‌ స్టయిల్‌తో సౌతాఫ్రికన్‌ క్రికెట్‌లో బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేశాడని ప్రశంసించాడు. కాగా, డికాక్‌ ఇదివరకే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వన్డే క్రికెట్‌ నుంచి వైదొలిగాక అతను టీ20ల్లో కొనసాగే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే, భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును ఇవాళ (సెప్టెంబర్‌ 5) ప్రకటించింది. ఈ జట్టులో డికాక్‌ సహా మొత్తం 15 మంది సభ్యులకు చోటు దక్కింది. టెంబా బవుమా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ లాంటి యువ సంచలనాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అనుభవజ్ఞులైన వారికే సౌతాఫ్రికన్‌ సెలెక్టర్లు పెద్ద పీట వేశారు.

వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్‌, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్‌ కొయెట్జీ, మార్కో జన్సెన్‌, తబ్రేజ్‌ షంషి, కేశవ్‌ మహారాజ్‌ 
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top