దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌ | Dinusha–Mendis Partnership Boosts Sri Lanka’s Dominance Over West Indies, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

Jul 5 2026 9:18 AM | Updated on Jul 5 2026 12:34 PM

Sonal Dinusha, Kusal Mendis extend Sri Lanka advantage

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (549-9 డిక్లేర్‌) చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఇంకా 491 పరుగుల వెనుకబడి ఉంది.

రెండో రోజు ఆటలో కుసాల​్‌ మెండిస్‌ (69), సోనల్‌ దినుషా (92) విండీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఆరో వికెట్‌కు 143 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆఖర్లో మిలన్‌ రత్నాయకే (15), ప్రభాత్‌ జయసూర్య (17 నాటౌట్‌), విజెసుందర (14) ఓ మోస్తరు పరుగులు చేయడంతో శ్రీలంక 500 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు ఓపెనర్‌ లహీరు ఉదారా (188) భారీ శతకంతో కదంతొక్కగా.. కమిందు మెండిస్‌ (84) అర్ద సెంచరీతో రాణించాడు.

549 పరుగుల భారీ లక్ష్యానికి స్పందనగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాండన్ కింగ్‌ను (17) అసిత ఫెర్నాండో ఔట్‌ చేశాడు. 

అనంతరం జాన్ క్యాంప్‌బెల్ (31), కావెమ్ హాడ్జ్‌ (6) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement