
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. ఈ స్థానం కోసం పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కాచుకు కూర్చున్నాడు. ప్రస్తుతం గిల్, రెండో ర్యాంకర్ బాబర్ మధ్య కేవలం 18 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. గిల్‌కు అక్టోబర్ వరకు వన్డే మ్యాచ్ ఆడే అవకాశం లేకపోగా.. బాబర్ ప్రస్తుతం విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్నాడు.
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో బాబర్ ఓ మోస్తరు ప్రదర్శనతో రాణించాడు. 64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 47 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో బాబర్ రేటింగ్ పాయింట్లు మెరుగుపడే అవకాశం ఉంది. మిగతా రెండు వన్డేల్లో బాబర్ ఇలాంటి ప్రదర్శనలే చేసిన సిరీస్ ముగిసే సమయానికి ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహిస్తాడు.
గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడకపోగా.. బాబర్ ఈ మధ్యలో పలు మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజమ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్ వరుసగా టాప్-5లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా విండీస్‌తో జరిగిన వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. షాహీన్ అఫ్రిది (8-0-51-4), నసీం షా (8-0-55-3) ధాటికి 49 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లూయిస్ (60), షాయ్ హోప్ (55), రోస్టన్ ఛేజ్ (53) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన పాక్.. బాబర్ ఆజమ్ (47), మొహమ్మద్ రిజ్వాన్ (53), హసన్ నవాజ్ (63 నాటౌట్), హుస్సేన్ తాలత్ (41 నాటౌట్) రాణించడంతో 48.5 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, జేడన్ సీల్స్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇవాళ (ఆగస్ట్ 10) రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.