IND vs ZIM: మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్

Ind Vs Zim 3rd ODI- Shubman Gill Century: హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు. తద్వారా గిల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 82 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా 97 బంతుల్లో 130 పరుగులు సాధించిన గిల్.. భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్ సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు.
మూడేళ్ల నిరీక్షణకు తెర
గిల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆర్ధ శతకాలతో మెరిసిన గిల్ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో అతడిని దురదృష్టం కూడా వెంటాడింది.
ముఖ్యంగా ఈ ఏడాది విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 98 పరుగులు చేసి సెంచరీకి చేరువైన క్రమంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అతడు తన తొలి సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయితే ఈ సారి మాత్రం గిల్ తన కలను నెరవేర్చుకున్నాడు.
అద్భుతమైన ఫామ్‌లో గిల్
కాగా ఇటీవల కాలంలో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్... ఇప్పుడు జింబాబ్వేపై కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో 245 పరుగులు సాధించిన గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
2019లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌తో గిల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 2020 నాటి సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక తన కెరీర్‌లో ఇప్పటి వరకు 9 వన్డేలో ఆడిన గిల్ 499 పరుగులు సాధించాడు.
చదవండి: Ind Vs Zim 3rd ODI: అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇది నిజంగా అన్యాయం! కనీసం ఇప్పుడైనా..