Tagenarine Chanderpaul: తండ్రికి తగ్గ తనయుడు

Shivnarine Chanderpaul Son T Chanderpaul Scores Century In Australia Tour - Sakshi

Shivnarine Chanderpaul: వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ కొడుకు టగెనరైన్‌ చంద్రపాల్‌.. తన తొలి అధికారిక విదేశీ పర్యటనలోనే సెంచరీ బాది అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన విండీస్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న టగెనరైన్‌ చంద్రపాల్‌.. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌ జట్టుతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి, దాదాపు 90 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండి 7వ వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 293 బంతులు ఎదుర్కొన్న టగెనరైన్‌.. 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 119 పరుగులు చేశాడు. టగెనరైన్‌ ఇన్నింగ్స్‌ తండ్రి శివ్‌నరైన్‌ను గుర్తు చేసిందని క్రికెట్‌ అభిమానులు చర్చించుకున్నారు. అచ్చం తండ్రిలాగే ఓపికగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌ ఆడాడని ప్రశంసిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడని కొనియాడుతున్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఇన్నింగ్స్‌ మొత్తంలో టగెనరైన్‌ ఒక్కడే రాణించడం విశేషం. కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (47) ఓ మోస్తరుగా రాణించగా మిగతావారంతా దారుణంగా విఫలయ్యారు. ఫలితంగా ఆ జట్టు 234 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌ జట్టు.. మ్యాట్‌ రెన్‌షా (81), మార్కస్‌ హ్యారిస్‌ (73), హ్యాండ్స్‌కోంబ్‌ (55) అర్ధసెంచరీలతో రాణించడంతో 91.5 ఓవర్లలో 322 పరుగులు చేసి ఆలౌటైంది. 

ఇవాళ (నవంబర్‌ 25) రెండో ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్న ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌ జట్టు.. మ్యాట్‌ రెన్‌షా (71 నాటౌట్‌), హ్యాండ్స్‌కోంబ్‌ (75) మరోసారి అర్ధసెంచరీలతో రాణించడంతో డిన్నర్‌ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆ జట్టు 252 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, నవంబర్‌ 30 నుంచి ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న టగెనరైన్‌.. విండీస్‌ తరఫున టెస్ట్‌ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైనట్లే.     

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top