Shikar Dhawan: 'ప్రేమించండి.. పెళ్లి మాత్రం చేసుకోకండి'

Shikhar Dhawan Breaks Silence On Separation With Wife Viral - Sakshi

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ టీమిండియా ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్‌ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్‌ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే.

ఇక వ్యక్తిగత జీవితంలో తనకంటే పదేళ్ల పెద్దదైన అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014లో ఈ దంపతులకు జొరావర్‌ పుట్టాడు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం సెప్టెంబర్‌ 2021లో ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడని గబ్బర్‌ తొలిసారి తాను, అయేషా విడిపోడంపై స్పందించాడు. 

''పెళ్లి అనే పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే అది ఓ ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు, రెండు వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. తను తప్పు చేసిందని అనను.. అలాగని నాది తప్పని ఒప్పుకోను. నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు. ఆట గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా... అది అనుభవంతో వచ్చింది. 

విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు, తొందర మాత్రం పడను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నా. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్‌ మాత్రం పెట్టుకోలేదు.

అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. రిలేషన్‌లో ఉంటే, అన్నింటినీ  అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి.

కొన్నేళ్ల పాటు కలిసి ఉండి, తన గురించి నీకు, నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. ఇది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు, ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం.'' అని పేర్కొన్నాడు. 

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధావన్‌ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టి తన ప్లేస్‌ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు.

చదవండి: 'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్‌ గిల్‌ బెటర్‌'

చెత్త రికార్డు సమం చేసిన డికాక్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top