Shane Warne: మా గుండె ప‌గిలింది.. మాట‌లు రావ‌డం లేదు: రాజ‌స్తాన్ రాయ‌ల్స్ భావోద్వేగం

Shane Warne Passed Away: Rajasthan Royals Heartfelt Tribute Forever Our Captain - Sakshi

"షేన్ వార్న్.. ఆ పేరే ఓ మ్యాజిక్. మా ఫ‌స్ట్ రాయ‌ల్‌... అసాధ్య‌మ‌నేది ఏదీ ఉండ‌ద‌ని నిరూపించిన వ్య‌క్తి. మ‌మ్మ‌ల్ని ముందుండి న‌డిపించిన నాయ‌కుడు. అండ‌ర్‌డాగ్స్ ను చాంపియ‌న్లుగా నిలిపిన సార‌థి. గొప్ప మెంటార్‌. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. ఈ క్ష‌ణంలో మా మ‌న‌సులో చెల‌రేగుతున్న భావ‌న‌లు, విషాదాన్ని వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. మా గుండె ప‌గిలింది. యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం, అభిమానుల హృదయం ముక్క‌లైంది.

వార్న్.. నువ్వు ఎల్ల‌ప్పుడూ మా కెప్టెన్‌వే, మా నాయ‌కుడివే, మా రాయ‌ల్‌వే. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి లెజెండ్" అంటూ ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ భావోద్వేగ నోట్ షేర్ చేసింది. త‌మ‌కు తొలి టైటిల్ అందించిన సార‌థి, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్  వార్న్ కు  హృదయ పూర్వ‌క నివాళి అర్పించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద్వేగ‌భ‌రిత క్యాప్ష‌న్ జ‌త చేసింది.

కాగా అశేష అభిమానుల‌ను శోక సంద్రంలో ముంచుతూ స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందిన విష‌యం విదిత‌మే. సుదీర్ఘ కెరీర్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు త‌న ఖాతాలో వేసుకున్న వార్న్.. ఐపీఎల్‌లోనూ త‌న పేరిట చెక్కు చెద‌ర‌ని రికార్డు లిఖించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ వేలంలో భాగంగా 2008లో వార్న్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో సార‌థిగా జ‌ట్టును ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చిన వార్న్ ఆరంభ సీజ‌న్‌లోనే ట్రోఫీ సాధించి స‌త్తా చాటాడు.

ఏమాత్రం అంచ‌నాలు లేకుండా బ‌రిలోకి దిగిన జ‌ట్టును చాంపియ‌న్‌గా నిలిపి ఫ్రాంఛైజీకి మధురానుభూతిని మిగిల్చాడు. ఇక కామెంటేట‌ర్‌గానూ రాణించిన‌ వార్న్.. ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి నేను సిద్దంగా ఉన్నానంటూ ఇటీవ‌లే త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు. జట్టును విజయ పథంలో నడిపించగలన‌న్న విశ్వాసం వ్యక్తం చేశాడు. కానీ ఇంత‌లోనే 52 ఏళ్ల వ‌య‌సులో తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయాడు. 

చ‌ద‌వండి: IND vs SL 1st Test: ఏంటి రోహిత్‌.. డుప్లెసిస్ బ్యాటింగ్‌ను కాపీ కొడుతున్నావా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top