భార్య మాట... బంగారు బాట! | T20 world cup winner team captain suryakumar yadav Inner Thoughts | Sakshi
Sakshi News home page

భార్య మాట... బంగారు బాట!

Mar 18 2026 4:11 AM | Updated on Mar 18 2026 4:11 AM

T20 world cup winner team captain suryakumar yadav Inner Thoughts

సతీమణి ప్రశ్నతో కెరీర్‌ దశ మారింది

జాతీయ జట్టులోకి రావాలనే పట్టుదల పెరిగింది

భారత టి20 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ మనోగతం  

టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగు పెట్టడం... సొంతగడ్డపై విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి స్టార్‌ ప్లేయర్లు లేకుండా వరల్డ్‌కప్‌ ఆడటం... మెగా టోర్నమెంట్‌కు ముందు అనూహ్యంగా ఇషాన్‌ కిషన్‌పై భరోసా పెట్టడం... కీలక మ్యాచ్‌ల్లో సంజూ సామ్సన్‌కు అండగా నిలవడం నుంచి మొదలుకొని... భార్య సలహాలతో ఆలోచన విధానాన్నే మార్చుకొని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు... టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కెరీర్‌లోని పలు కీలక దశలపై ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఐపీఎల్‌తోనే సరిపెట్టుకోవాలనుకున్న తాను... భార్య సూచనలతో భారత జట్టు కెప్టెన్‌గా ఎదగడం... తరగతి గదిలో సాధించలేనిది మైదానంలో చేసి చూపడం ఇలా సూర్యకుమార్‌ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే...  

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న సమయంలో దివిశతో నా వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపించింది. రెండేళ్ల తర్వాత 2018లో ముంబై ఇండియన్స్‌తో జతకట్టా. అదే సమయంలో నా భార్య ఒక ప్రశ్న వేసింది. ‘ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో నీతో కలిసి ఆడిన వాళ్లు చాలా మంది ఇప్పుడు భారత  జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీ మనసులో ఏం ఉంది’ అని సీరియస్‌గా అడిగింది. ఆ సమయంలో నాకు కూడా టీమిండియా తరఫున ఆడాలని ఉంది అని చెప్పా. అయితే అందుకు నీ ప్రయత్నాలు ఏవి అని నేరుగా ప్రశ్నించింది. 

ఇలా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ నా ఆలోచన ధోరణి ని మార్చింది. అప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంపై మరింత దృష్టి సారించా. ఆలోచనల నుంచి ఆహారం వరకు మొత్తం మార్చేశా. సినిమాలు, షికార్లు అన్నీ పక్కన పెట్టి తీవ్రంగా శ్రమించా. ఆ ఫలితం త్వరలోనే కనిపించింది. 2018లో ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చా... అలాగే దేశవాళీల్లోనూ భారీగా పరుగులు చేశా. అలా వరుసగా మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌ తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడా. 

2020లో ఫినిషర్‌గా బాగా రాణించా... దీంతో మరుసటి ఏడాది టీమిండియా తరఫున పిలుపు వచ్చింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరవలేను. భార్య అడిగిన చిన్న ప్రశ్న నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అలా అని తను నా కెరీర్‌లో జోక్యం చేసుకోదు. ఎలా ఆడాలి అనే విషయాల గురించి అసలు మాట్లాడదు. కానీ నా ఆలోచన విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అందుకే నా విజయాల్లో అగ్రభాగం ఆమెకే దక్కుతుంది. అలా అని ఇంట్లో ఎప్పుడూ క్రికెట్‌ చర్చే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఆటను గేటు బయటే పట్టి ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు సూర్యకుమార్‌ యాదవ్‌ కాదు... కేవలం సూర్య మాత్రమే అంటూ చమత్కరిస్తుంది.   

అప్పటికి ఇప్పటికి అదే తేడా... 
2024లో టి20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో... తాజాగా ట్రోఫీ చేజిక్కించుకున్న జట్టులో చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. 2024 టీమ్‌లో అనుభవంతో కూడిన జోరు ఉండేది... ఇప్పుడు జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో అనుభవజు్ఞలు ఉండేవారు. ఎవరి బాధ్యతలు వారికి పక్కాగా ఉండేవి. ప్రస్తుత జట్టులో అనుభవం ఎక్కువగా లేకున్నా... ఉత్సాహం మాత్రం కావల్సినంత ఉంది.  

స్వదేశంలో ఆడటంపై... 
ప్రపంచకప్‌ అంటే అంచనాలు భారీగా ఉండటం సహజం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తుండటంతో పాటు... డిఫెండింగ్‌ చాంపియన్‌గా మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయని మాకూ తెలుసు. టీమిండియాపై అది ఎప్పుడైనా సహజమే. భావోద్వేగాల విషయంలో గత టోర్నీకి ఇప్పటకీ పెద్ద తేడా లేదు. కానీ... సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడుతుండటంతో అది మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది.  

అర్ష్ దీప్‌–మిచెల్‌ వివాదంపై.. 
న్యూజిలాండ్‌తో టి20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా డారిల్‌ మిచెల్‌పైకి అర్‌‡్షదీప్‌ సింగ్‌ బంతి విసిరిన సందర్భంలో నేను కివీస్‌ ప్లేయర్‌కు క్షమాపణలు చెప్పా. ఇలాంటి పెద్ద మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది. అర్ష్ దీప్‌ కూడా క్షణికావేశంలో జరిగిపోయిందని అన్నాడు. వెంటనే మిచెల్‌కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం అర్ష్ దీప్‌ బహిరంగంగా సైతం ఇదే పనిచేశాడు. సారథిగా ప్రత్యర్థి ప్లేయర్లను సైతం గౌరవించడం నా బాధ్యత. 

కెప్టెన్‌గా డిస్టింక్షన్‌ 
చదువుకునే రోజుల్లో 80 శాతం మార్కులు వస్తే బాగుండు అని ఎంతో అనుకునేవాడిని కానీ... అది ఎప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు క్రికెట్‌లో అది జరిగింది. టీమిండియా కెప్టెన్‌గా అంతర్జాతీయ టి20ల్లో 80 శాతం విజయాలు సాధించగలిగాను. 2024 టి20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నా. అప్పటి నుంచి 52 మ్యాచ్‌లు ఆడితే అందులో 42 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది. 

స్కూల్లో ఎప్పుడూ నా మార్కులు 50 శాతానికి మించలేదు. చిన్నప్పుడు నాకు మంచి మార్కులు రావాలని కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడేవారు. కానీ నాకు చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. దీంతో ఆటలపై ఉన్న ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించారు. దీంతో క్రికెట్‌లో డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యాను. 

టి20ల్లో చేయితిరిగిపోయింది  
జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేశవాళీల్లో 10–12 ఏళ్లు ఆడాను. ముంబైలో క్రికెట్‌ ప్రారంభించిన వాళ్లు ఎవరైనా... ఎర్ర బంతితోనే ప్రాక్టీస్‌ చేస్తారు. నేను అంతే! అయితే టీమిండియా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడా. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ అదీ సాధ్యపడలేదు. టి20 ఫార్మాట్‌లో మాత్రం చేయితిరిగిపోయింది. 

టి20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు జితేశ్‌ శర్మను కాదని ఇషాన్‌ను ఎంపిక చేశాం. అప్పుడే అతడితో ట్రోఫీ గెలిపిస్తావా అని అడిగాను. ముందు నమ్ము అని అన్నాడు. అదే జరిగింది. సామ్సన్‌ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టోర్నమెంట్‌లో మా జట్టు ఆటతీరే మారిపోయింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement