శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం అర్జున రణతుంగ, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ మధ్య వైరం గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము ఒకరికొకరం నచ్చమని ఇద్దరూ పలు సందర్భాల్లో వెల్లడించారు.
షేన్ వార్న్ గురించి అతిగా చెప్తున్నారే తప్ప.. అతడికి అంత సీన్ లేదని అర్జున రణతుంగ 1996 ప్రపంచకప్ సందర్భంగా అన్నాడు. అంతేకాదు.. యువకులు రోల్ మోడల్‌గా తీసుకోదగ్గ వ్యక్తికాదని విమర్శించాడు.
ఇందుకు ప్రతిగా షేన్ వార్న్.. ‘షేన్ వార్న్ సెంచరీ: నా టాప్ 100 టెస్టు క్రికెటర్లు’ పేరిట రాసిన పుస్తకంలో అర్జున్ రణతుంగకు 93వ ర్యాంకు ఇచ్చాడు. ఇలా వీరి మధ్య వైరమే తప్ప మచ్చుకైనా స్నేహంగా కనిపించిన దాఖలాలు లేవు.
1996 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో
కాగా 1996 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్లో శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక ఆసీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. శ్రీలంక 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన వేళ అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా అరవింద డి సిల్వ అజేయ శతకం (124 బంతుల్లో 107)తో అదరగొట్టగా.. అసాంక గురుసిన్హ 99 బంతుల్లో 65 పరుగులతో రాణించాడు.
58 పరుగులు ఇచ్చి
ఫలితంగా 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసిన శ్రీలంక.. ఆసీస్‌ను చిత్తు చేసి తొలిసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో షేన్ వార్న్ పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 58 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అతడేమీ గొప్ప బౌలర్ కాదు
నాటి ఈ సంగతుల గురించి అప్పటి సెంచరీ హీరో అరవింద డిసిల్వ తాజాగా ఓ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు. షేన్ వార్న్‌ను మైండ్‌గేమ్‌లో ఓడించి అర్జున రణతుంగ పైచేయి సాధించినట్లు తెలిపాడు. ‘‘ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం, ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో.. ఫైనల్‌కు ముందు రణతుంగ షేన్ వార్న్‌ను టార్గెట్ చేశాడు.
అతడేమీ గొప్ప బౌలర్ కాదని.. అయినా సరే చాలా మంది అతడి బౌలింగ్ గురించి ఎందుకంతగా మాట్లాడతారో తనకు అర్థం కాదని అన్నాడు. ఈ మాటలతో వార్న్ తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. రణతుంగ, తాను రిటైర్ తర్వాత ఇదే విషయం గురించి ప్రస్తావన రాగా షేన్ వార్న్ ఏమన్నాడంటే..
నాకు ఇప్పుడు అర్థమైంది
‘ఆరోజు అతడు ఎందుకలా అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను గందగోళంలోకి నెట్టేయాలని అలా అన్నాడు. ఆ సమయంలో నేను నా బౌలింగ్‌పై నియంత్రణ కోల్పోయాను. ప్రతిసారి అతడిని అవుట్ చేయాలనే లక్ష్యంతోనే బౌలింగ్ చేశానే తప్ప ఆటపై దృష్టి పెట్టలేకపోయాను.
ఏం జరుగుతుందో అర్ధం చేసుకోలేకపోయాను. అతడు మైండ్‌గేమ్‌లో గెలిచాడు’ అని చెప్పాడు. రణతుంగ వ్యూహాలు అలా ఉంటాయి మరి’’ అని డిసిల్వ చెప్పుకొచ్చాడు.
కాగా వార్న్ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు తీయగా.. 194 వన్డేల్లో 293 వికెట్లు కూల్చాడు. 1999లో వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మరోవైపు.. రణతుంగ శ్రీలంక తరఫున 83 టెస్టుల్లో 5105, 269 వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. లంకకు వరల్డ్‌కప్ అందించిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
“Arjuna said Warne wasn’t a great bowler…”
30 years later, Aravinda reveals what happened next.
“Warne told me he lost control… he only wanted Arjuna’s wicket.”
Mind games. Big stage. Big impact. 🇱🇰🔥 pic.twitter.com/34ycroOb5w— NewsWire 🇱🇰 (@NewsWireLK) March 17, 2026


