నాలుగో టీ20లోనూ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హోప్‌ | Shai Hope has most Hundreds by a West Indies Mens batter in T20I history. | Sakshi
Sakshi News home page

నాలుగో టీ20లోనూ సెంచరీ.. చరిత్ర సృష్టించిన హోప్‌

Oct 14 2026 9:40 PM | Updated on Oct 14 2026 9:40 PM

Shai Hope has most Hundreds by a West Indies Mens batter in T20I history.

source: X

వెస్టిండీస్‌ కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ ప్రస్తుత భారత పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు (2, 3 వన్డేల్లో) బాదిన అతడు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో రెండు శతకాలు సాధించాడు. 

తొలుత రెండో టీ20లో శతక్కొట్టిన హోప్‌, ఇవాళ జరుగుతున్న నాలుగో టీ20లో మరింత రెచ్చిపోయి, కెరీర్‌లో మూడో టీ20 శతకాన్ని బాదాడు.

ఈ క్రమంలో హోప్‌ విండీస్‌ తరఫున టీ20ల్లో​ అత్యధిక సెంచరీలు (3) చేసిన ప్లేయర్‌గా క్రిస్‌ గేల్‌ (2), ఎవిన్‌ లూయిస్‌ (2) రికార్డు బద్దలు కొట్టాడు. తాజా శతకం హోప్‌కు మూడు ఫార్మాట్లలో 29వది. వన్డేల్లో 21, టెస్ట్‌ల్లో 5 శతకాలు సాధించిన అతడు.. టీ20ల్లో మూడు శతకాలు బాదాడు.

ప్రస్తుత టీ20 సిరీస్‌లోని తొలి టీ20లోనూ హోప్‌ రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతడు అర్ద సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో హోప్‌ భీకర ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. హోప్‌ శతకొట్టుడుతో నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్‌  చేసిన విండీస్‌ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హోప్‌ ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి సెంచరీ (50 బంతుల్లో 102 నాటౌట్‌; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. హోప్‌కు జతగా రూథర్‌ఫోర్డ్‌ (49 నాటౌట్‌) కూడా ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో జువెల్‌ ఆండ్రూ (21), హెట్‌మైర్‌ (33), రోవ్‌మన్‌ పావెల్‌ (24) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌కు తలో వికెట్‌ దక్కింది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ధీటుగా జవాబిస్తున్న భారత్‌
248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ ధీటుగా జవాబిస్తుంది. తొలి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మెరుపు అర్ద శతకం (56) బాది ఔటయ్యాడు. ఇషాన​్‌ కిషన్‌ కూడా సిక్సర్‌ బాది మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపి​ంచినా, ఆతర్వాత బంతికే ఔటయ్యాడు. అభిషేక్‌ (8), శ్రేయస్‌ అయ్యర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు.

ఇదీ చదవండి: IND vs WI: శతక్కొట్టిన కెప్టెన్‌.. విండీస్‌ భారీ స్కోరు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement