Shafali Verma: వన్డేల కోసం శైలి మార్చుకుంటా

Shafali Verma set for Test and ODI debuts against England Women - Sakshi

భారత మహిళా క్రికెటర్‌ షఫాలీ వర్మ

న్యూఢిల్లీ: టి20 క్రికెట్‌లో ఒక్కసారిగా దూసుకొచ్చిన తార షఫాలీ వర్మ. దూకుడైన ఆటకు మారుపేరైన షఫాలీ భారత్‌ తరఫున తన 22 మ్యాచ్‌ల స్వల్ప కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా 148.31 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేసిన ఈ హరియాణా టీనేజర్‌... అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలి సారి భారత వన్డే టీమ్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం కూడా ఎంపికైంది. అయితే తన విధ్వంసక శైలిని పరిస్థితి అనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానని షఫాలీ చెప్పింది.

ముఖ్యంగా 50 ఓవర్ల మ్యాచ్‌లో సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడగలిగితేనే జట్టుకు తాను ఉపయోగపడగలనని ఆమె అభిప్రాయ పడింది. టెస్టు మ్యాచ్‌ ఆడే తుది జట్టులో అవకాశం లభిస్తే అక్కడా సత్తా చాటగలనని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. మిథాలీ రాజ్‌ నేతృత్వం లోని భారత జట్టు 2014 తర్వాత తొలి సారి టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ‘ఏడేళ్ల తర్వాత మన టీమ్‌కు టెస్టు ఆడే అవకాశం లభించింది. టెస్టు టీమ్‌లో నాకూ చోటు దక్కడం సంతోషం. ఆ మ్యాచ్‌ ద్వారా ఎంతో నేర్చుకునే అవకాశం నాకు కలుగుతుంది.

సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో గడిపే ఓపికతో పాటు ఎలా పడితే అలా బాదేయకుండా సరైన బంతులను ఎంచుకునేందుకు కావాల్సిన అవగాహన కలుగుతుంది. మూడు ఫార్మాట్‌లు కూడా దేనికదే భిన్నం. కాబట్టి టెస్టు, వన్డేలనుంచి కూడా కొత్త అంశాలు తెలుసుకోగలను. ఎక్కువ మ్యాచ్‌లలో నాకు అవకాశం దక్కాలని కోరుకుంటా. అప్పుడే బాగా ఆడి నన్ను నేను నిరూపించుకోగలను. నాకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని కెరీర్‌లో ముందుకు వెళ్లగలను. తొలి సారి అవకాశం (వన్డే, టెస్టు) అనేది ఎవరికైనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రాబోయే సిరీస్‌లో బాగా ఆడి జట్టును గెలిపించగలిగితే అంతకంటే కావాల్సిందేముంది’ అని షఫాలీ తన మనసులో మాట చెప్పింది.

బ్యాటింగ్‌ కోచ్‌గా శివ్‌ సుందర్‌ దాస్‌
భారత మహిళల క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ ఆటగాడు శివ్‌ సుందర్‌ దాస్‌ ఎంపికయ్యాడు. త్వరలో జరిగే ఇంగ్లండ్‌ పర్యటన కోసం దాస్‌ను బీసీసీఐ నియమించింది. గత కొన్నేళ్లుగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి కోచ్‌గా అతను పని చేస్తున్నాడు. 2020లో జరిగిన పట్నాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో భారత మహిళల ‘ఎ’ జట్టుకు పని చేసిన అనుభవం దాస్‌కు ఉంది. సీనియర్‌ టీమ్‌తో జత కట్టడం మాత్రం ఇదే తొలిసారి. 2000–2002 మధ్య కాలంలో భారత్‌ తరఫున ఓపెనర్‌గా 23 టెస్టులు ఆడిన శివ్‌ సుందర్‌ దాస్‌ 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేశాడు. మరో 4 వన్డేల్లో కూడా అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  

  మహిళల జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా అభయ్‌ శర్మను ఎంపిక చేసిన బోర్డు...బరోడాకు చెందిన రాజ్‌కువర్‌దేవి గైక్వాడ్‌ను మేనేజర్‌గా నియమించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో  ఇంగ్లండ్‌తో తలపడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top