Tokyo Olympics: శుభవార్త వింటామా!

Schedule of Indian athletes Tokyo Olympic in Day 2 - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో నేడు నాలుగు మెడల్‌ ఈవెంట్స్‌ బరిలో భారత క్రీడాకారులు

ఉదయం 8 గంటలకల్లా షూటింగ్‌లో తొలి ఫలితం

షూటింగ్, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్, జూడో క్రీడాంశాల్లో మనోళ్ల పోరు

టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మెడల్‌ ఈవెంట్‌ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్‌ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లోనూ మెడల్‌ ఈవెంట్‌ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్‌ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది.

మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్‌
క్వాలిఫయింగ్‌: ఉదయం
గం. 5:00 నుంచి; ఫైనల్‌: ఉదయం గం. 7:15 నుంచి
పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫయింగ్‌: ఉదయం
గం. 9:30 నుంచి; ఫైనల్‌: మధ్యాహ్నం గం. 12 నుంచి

నాలుగు పతకాలపై షూటర్ల గురి...
కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో భారత షూటర్లు నిలకడగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్‌ కోసం క్రొయేషియాలో ప్రత్యేకంగా రెండు నెలలపాటు సాధన చేశారు. తొలి రోజు రెండు విభాగాల్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ఇలవేనిల్‌ వలారివన్, అపూర్వీ చండేలా పోటీపడనున్నారు. 48 మంది షూటర్లు పాల్గొనే క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో టాప్‌–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇలవేనిల్, అపూర్వీ తొలి లక్ష్యం ఫైనల్‌ చేరడమే. అనంతరం ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు స్కోరు చేస్తేనే ఇలవేనిల్, అపూర్వీ పతకాలను ఖాయం చేసుకుంటారు. పురుషుల 10 ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సౌరభ్‌ చౌదరీ, అభిషేక్‌ వర్మ బరిలో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సౌరభ్‌ రెండో స్థానంలో, అభిషేక్‌ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. 36 మంది పాల్గొనే క్వాలిఫయింగ్‌లో రాణించి టాప్‌–8లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు సాధిస్తే సౌరభ్, అభిషేక్‌ల నుంచి పతకాలు ఆశించవచ్చు.

    దీపిక–ప్రవీణ్‌ జోడీ అద్భుతం చేస్తేనే...
♦ మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌: ఉదయం గం. 6 నుంచి
♦ కాంస్య పతక మ్యాచ్‌: మధ్యాహ్నం గం. 12:55  నిమిషాల నుంచి
♦ స్వర్ణ–రజత పతక మ్యాచ్‌: మధ్యాహ్నం గం. 1:15 ని. నుంచి

ఆర్చరీలో శుక్రవారం మహిళల, పురుషుల ర్యాంకింగ్‌ రౌండ్‌లు జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ దీపిక కుమారి 663 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్‌ జాదవ్‌ 656 పాయింట్లు స్కోరు చేసి 31వ ర్యాంక్‌లో... అతాను దాస్‌ 653 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో... తరుణ్‌దీప్‌ రాయ్‌ 652 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌ తరఫున దీపిక కుమారి–ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ బరిలోకి దిగనుంది.

భార్యాభర్తలైన దీపిక, అతాను దాస్‌ జతగా ఈ విభాగంలో పోటీపడుతుందని ఆశించినా... ర్యాంకింగ్‌ రౌండ్‌లో అతాను దాస్‌ వెనుకంజలో ఉండటం... ప్రవీణ్‌ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో... దీపికకు భాగస్వామిగా ప్రవీణ్‌నే ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం స్పష్టం చేసింది. నేడు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మెడల్‌ ఈవెంట్‌ జరగనుంది. దీపిక–ప్రవీణ్‌ సంయుక్త స్కోరు (1319) ఆధారంగా తొలి రౌండ్‌లో ఈ జంటకు తొమ్మిదో సీడ్‌ లభించింది. నాకౌట్‌ పద్ధతిలో జరిగే మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో తొలి రౌండ్‌లో లిన్‌ చియా ఇన్‌–టాంగ్‌ చి చున్‌ (చైనీస్‌ తైపీ) ద్వయంతో దీపిక–ప్రవీణ్‌ జంట తలపడుతుంది. తొలి రౌండ్‌ దాటితే క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆన్‌ సాన్‌–కిమ్‌ జె డియోక్‌ (దక్షిణ కొరియా)లతో దీపిక–ప్రవీణ్‌ తలపడే అవకాశముంది. కొరియా అడ్డంకిని అధిగమిస్తే దీపిక–ప్రవీణ్‌ సెమీఫైనల్‌ చేరతారు.

మీరాబాయి మెరిసేనా...
ప్రపంచ మాజీ చాంపియన్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకం మోసుకొస్తుంది. ఎనిమిది మంది పోటీపడే ఫైనల్లో మీరాబాయికి చైనా లిప్టర్‌ జిహుయ్‌ హు, డెలాక్రుజ్‌ (అమెరికా), ఐసా విండీ కంతిక (ఇండోనేసియా) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మీరాబాయి అదే ప్రదర్శనను పునరావృతం చేసి, స్నాచ్‌లోనూ రాణిస్తే ఆమెకు కనీసం కాంస్యం దక్కే అవకాశముంది.

మహిళల 49 కేజీల విభాగం ఫైనల్‌: ఉదయం గం. 10.20 నిమిషాల నుంచి

సుశీలా ‘పట్టు’ ప్రయత్నం
మహిళల జూడో 48 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుశీలా దేవి పోటీపడనుంది. తొలి రౌండ్‌లో ఆమె ఇవా సెర్నోవిక్జీ (హంగేరి)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫునా తొనాకి (జపాన్‌)తో సుశీలా తలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీలా 33వ ర్యాంక్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో సుశీలా పతకం రేసులో నిలిస్తే అద్భుతమే అవుతుంది.
తొలి రౌండ్‌: ఉదయం గం. 7: 30 తర్వాత
 
బ్యాడ్మింటన్‌
పురుషుల డబుల్స్‌ లీగ్‌ మ్యాచ్‌: సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ్ఠ యాంగ్‌ లీ–చి లిన్‌ వాంగ్‌ (చైనీస్‌ తైపీ); ఉదయం గం. 8:50 నుంచి.
పురుషుల సింగిల్స్‌ లీగ్‌ మ్యాచ్‌: సాయిప్రణీత్‌ ్ఠ మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌); ఉదయం గం. 9:30 నుంచి

 
బాక్సింగ్‌

పురుషుల 69 కేజీల తొలి రౌండ్‌: వికాస్‌ కృషన్‌ ్ఠ మెన్సా ఒకజావా (జపాన్‌);
మధ్యాహ్నం గం. 3:55 నుంచి.

   

హాకీ
పురుషుల విభాగం లీగ్‌ మ్యాచ్‌: భారత్‌ VS న్యూజిలాండ్‌ (ఉదయం గం. 6:30 నుంచి).
మహిళల విభాగం లీగ్‌ మ్యాచ్‌: భారత్‌ VS నెదర్లాండ్స్‌ (ఉదయం గం. 5:15 నుంచి)
 
రోయింగ్‌
లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ హీట్‌–2: అర్జున్‌ లాల్‌–అరవింద్‌ సింగ్‌
(ఉదయం గం. 7:30 నుంచి)

టేబుల్‌ టెన్నిస్‌
మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌: శరత్‌ కమల్‌–మనిక బత్రా VS యున్‌ జు లిన్‌–చింగ్‌ చెంగ్‌ (చైనీస్‌ తైపీ) ఉదయం గం. 8:30 నుంచి
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌: మనిక బత్రా VS టిన్‌ టిన్‌ హో (బ్రిటన్‌); మధ్యాహ్నం గం. 12:15 నుంచి; సుతీర్థ ముఖర్జీ ్ఠ లిండా బెర్గ్‌స్టోరెమ్‌ (స్వీడన్‌); మధ్యాహ్నం గం. 1:00 నుంచి

 
టెన్నిస్‌
పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌: సుమిత్‌ నగాల్‌ ్ఠ ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌); ఉదయం గం. 7:30 నుంచి

నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11)
ఆర్చరీ (1)
రోడ్‌ సైక్లింగ్‌ (1)
ఫెన్సింగ్‌ (2)
జూడో (2)
షూటింగ్‌ (2)
తైక్వాండో (2)
వెయిట్‌లిఫ్టింగ్‌ (1)

అన్ని ఈవెంట్స్‌  ఉదయం గం. 6:00 నుంచి సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top